LOADING...
Dominican Republic: డొమినికన్ రిపబ్లిక్‌లో ఘోర ప్రమాదం.. పైకప్పు కూలి 79 మంది మృతి!
డొమినికన్ రిపబ్లిక్‌లో ఘోర ప్రమాదం.. పైకప్పు కూలి 79 మంది మృతి!

Dominican Republic: డొమినికన్ రిపబ్లిక్‌లో ఘోర ప్రమాదం.. పైకప్పు కూలి 79 మంది మృతి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 09, 2025
09:14 am

ఈ వార్తాకథనం ఏంటి

డొమినికన్ రిపబ్లిక్ రాజధాని సంతో డొమింగోలోని పేరొందిన జెట్ సెట్ నైట్‌క్లబ్‌ (Jet Set Nightclub) లో ఒక భయానక దుర్ఘటన చోటు చేసుకుంది. సంగీత కచేరీ జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా నైట్‌క్లబ్ పైకప్పు కూలిపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 79 మంది మృతి చెందినట్లు, 160 మందికిపైగా గాయపడ్డట్లు అధికారులు వెల్లడించారు. ఈ కచేరీకి సుమారు 600 మంది హాజరైనట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక రెస్క్యూ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది వైద్య బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీయేందుకు రెస్క్యూలు ముమ్మరంగా శ్రమిస్తున్నారు. గాయపడినవారిని సమీప ఆసుపత్రులకు తరలించారు.

Details

మృతుల్లో ప్రముఖులు

ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారిలో డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన ప్రముఖ మాజీ బేస్‌బాల్ ఆటగాళ్లు ఎమిలియో బోనిఫాసియో, లూయిస్ రామిరెజ్ ఉన్నారు. అలాగే ఒక ప్రావిన్స్ గవర్నర్ కూడా ఈ ప్రమాదంలో మరణించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, స్థానిక రాజకీయ నాయకులు హాజరైనట్లు తెలిసింది. నైట్‌క్లబ్ పైకప్పు కూలిపోవడానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అయితే అధిక జనసమూహం కారణంగా భవనంపై ఒత్తిడి పెరిగి ఇది జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Details

తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన డొమినికన్ రిపబ్లిక్

నైట్‌క్లబ్ యాజమాన్యం, నిర్మాణానికి సంబంధించి స్థానిక అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. అందులో కచేరీ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పైకప్పు కూలిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ దృశ్యాలు ఈ ఘటన తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి. డొమినికన్ రిపబ్లిక్ ప్రభుత్వం ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపింది. దేశవ్యాప్తంగా సంతాప దినం ప్రకటించి, బాధితులకు సాయంగా అత్యవసర నిధులను కేటాయించింది. ఈ ఘోర ప్రమాదం అంతర్జాతీయంగా కూడా దృష్టిని ఆకర్షించింది.