Iran: అమెరికా దాడుల భయం.. ఇరాన్ కీలక నిర్ణయం, గగనతలం మూసివేత!
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో పరిస్థితులు క్షణక్షణాన మారిపోతున్నాయి. ఒకవైపు చర్చలు కొనసాగుతుండగానే, మరోవైపు యూఎష్ మళ్లీ ఇరాన్ పై దాడులకు సిద్ధమవుతోందన్న వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కీలక పరిణామంగా ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది. దేశంలోని పశ్చిమ ప్రాంతానికి సంబంధించిన గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఇరాన్ పౌర విమానయాన సంస్థ విమానయాన సిబ్బందికి నోటమ్ (NOTAM) జారీ చేసింది. ఈ నెల 25 వరకు అన్ని విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అందులో పేర్కొంది. ఈ నోటమ్ జారీ చేసిన సమయంలో ఖతార్ ప్రభుత్వానికి చెందిన ఓ వీఐపీ విమానం ఇరాన్ గగనతలాన్ని దాటినట్లు సమాచారం. శాంతి ఒప్పంద చర్చల కోసం టెహ్రాన్‌కు వచ్చిన ఖతార్ ప్రతినిధి బృందం ఈ విమానంలో ప్రయాణించినట్లు తెలుస్తోంది.
వివరాలు
ఏ క్షణమైనా శాంతి ఒప్పంద ప్రకటన వెలువడే అవకాశాలు
ఇక అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయని, ఒప్పందానికి సంబంధించిన అనేక కీలక అంశాల్లో ఇరుదేశాల మధ్య సయోధ్య కుదిరినట్లు సమాచారం. దీంతో ఏ క్షణమైనా శాంతి ఒప్పంద ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ దౌత్య ప్రయత్నాలు చివరి నిమిషంలో విఫలమైతే టెహ్రాన్‌పై మళ్లీ దాడులు చేసే అంశాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో ఇరాన్ తన గగనతలాన్ని మూసివేయడం పశ్చిమాసియాలో మరింత ఆందోళనకు దారితీసింది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయాందోళనలు అక్కడి దేశాల్లో నెలకొన్నాయి.