Page Loader
Birthright Citizenship: డొనాల్డ్ ట్రంప్కి షాక్ ఇచ్చిన ఫెడరల్ కోర్టు.. జన్మతః పౌరసత్వం లభించే హక్కును రద్దును నిలిపివేస్తూ ఆదేశాలు.. 
డొనాల్డ్ ట్రంప్కి షాక్ ఇచ్చిన ఫెడరల్ కోర్టు

Birthright Citizenship: డొనాల్డ్ ట్రంప్కి షాక్ ఇచ్చిన ఫెడరల్ కోర్టు.. జన్మతః పౌరసత్వం లభించే హక్కును రద్దును నిలిపివేస్తూ ఆదేశాలు.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 24, 2025
08:39 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్‌కు ఊహించని షాక్ తగిలింది. వలస వచ్చి అమెరికాలో పుట్టిన పిల్లలకు సహజంగా ఇచ్చే పౌరసత్వ హక్కు (Birthright Citizenship)ను ట్రంప్ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సియాటిల్ ఫెడరల్ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కోర్టు ఆ ఆదేశాలను అడ్డుకోవడమే కాక, వాటిని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు పేర్కొంది. జనవరి 20న యూఎస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ట్రంప్ పలు కీలక కార్యనిర్వాహక ఉత్తర్వులను జారీ చేశారు.

వివరాలు 

ట్రంప్ పలు కీలక కార్యనిర్వాహక ఉత్తర్వుల జారీ

అందులో పారిస్ ఒప్పందంతో పాటు డబ్ల్యూహెచ్‌వో నుంచి వైదొలగడం,ప్రభుత్వ ఉద్యోగుల ఇంటి నుండి పని విధానాన్ని రద్దు చేయడం, ప్రభుత్వ నియామకాలపై నిషేధం విధించడం, క్యాపిటల్ హిల్‌పై దాడి చేసిన వారికీ క్షమాభిక్ష ఇవ్వడం, వలస వచ్చిన వారి పిల్లలకు జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేసే నిర్ణయం ఉన్నాయి. ఈ నిర్ణయం నేపథ్యంలో,డెమెక్రాట్ పార్టీ నాయకత్వంలోని వాషింగ్టన్, అరిజోనా, ఇల్లినాయిస్, ఓరేగాన్ రాష్ట్రాలు సియాటిల్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించాయి.

వివరాలు 

22 రాష్ట్రాలు, అనేక పౌరసంఘాలు కోర్టుల్లో పలు కేసులు

అమెరికా రాజ్యాంగం 14వ సవరణ ప్రకారం,ట్రంప్ ఆదేశాలు పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయని వాదించారు. అమెరికాలో పుట్టిన వారికి పౌరసత్వం కల్పించబడుతుందని న్యాయవాదులు తమ వాదనలు ముందుంచారు. ఈ దృష్ట్యా, సియాటిల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ జాన్ కాఫ్నర్ జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేసే ట్రంప్ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ తీర్పు ఇచ్చారు. ఈ పౌరసత్వ రద్దు పై ఇప్పటికే 22 రాష్ట్రాలు, అనేక పౌరసంఘాలు కోర్టుల్లో పలు కేసులు నమోదుచేసాయి.