Egypt: నైలు నదిలో మునిగిన ఫెర్రీ బోటు.. 10 మంది కూలీలు మృతి
ఈజిప్టు రాజధానికి వెలుపల నైలు నదిలో రోజువారీ కూలీలను తీసుకెళ్తున్న ఫెర్రీ బోటు మునిగిపోయింది. అందులో ఉన్న 15 మందిలో కనీసం 10 మంది మరణించారని అధికారులు సోమవారం తెలిపారు. ప్రాణాలతో బయటపడిన ఐదుగురిని ఆసుపత్రికి తరలించి, ఆ తర్వాత డిశ్చార్జ్ చేసినట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మునిగిపోవడానికి గల కారణాలను వెంటనే స్పష్టం చేయలేదు. మరణించిన వారి కుటుంబానికి 200,000 ఈజిప్షియన్ పౌండ్లు (సుమారు $6,466), గాయపడిన ఐదుగురిలో ఒక్కొక్కరికి 20,000 ($646) నష్టపరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
నిర్వహణా లోపాల వల్ల ఈజిప్టులో తరచుగా ప్రమాదాలు
గ్రేటర్ కైరోను ఏర్పాటు చేస్తున్న మూడు ప్రావిన్సులలో ఒకటైన గిజాలోని మోన్‌షాట్ ఎల్-కనాటర్ పట్టణంలో ఈ సంఘటన జరిగింది. నిర్వహణా లోపాల వల్ల ఈజిప్టులో బోటు ,రైల్వే,రోడ్డు ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి. 2022లో ఒక చిన్న ట్రక్కు ఫెర్రీ నుండి జారిపడి నైలు నదిలో పడటంతో ఇద్దరు వ్యక్తులు మరణించగా,ఎనిమిది మంది తప్పిపోయారు. 2015 లో నైలు నదిలో ప్రయాణీకుల పడవ, స్కౌ మధ్య ఢీకొన్న ప్రమాదంలో 35 మంది మరణించారు.