Israel-Lebanon: లెబనాన్‌లో భీకర దాడులు.. 52 మంది దుర్మరణం
ఇజ్రాయెల్-హెజ్‌బొల్లాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, టెల్ అవీవ్ లెబనాన్‌పై తాజాగా దాడులు జరిపింది. ఈశాన్య లెబనాన్‌లోని బెకా వ్యాలీపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయగా, ఈ దాడుల్లో 52 మంది ప్రాణాలు కోల్పోయారని అక్కడి ఆరోగ్య మంత్రిత్వశాఖ ధ్రువీకరించింది. ప్రజలు సురక్షితంగా బయటపడేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ దాడులు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ దాడుల వల్ల దహియేలోని పలు భవనాలు కూడా ధ్వంసం కావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే, ఈ ప్రాంతంలో ప్రాణనష్టం జరగలేదని అక్కడి అధికారులు వెల్లడించారు.
హమాస్ కీలక అధికారి మృతి
ఇక మరోవైపు, హెజ్‌బొల్లా ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులు చేయగా, ఈ దాడుల్లో 11 మంది గాయపడినట్లు సమాచారం. అదే సమయంలో హమాస్ సీనియర్ నేత ఇజ్ అల్ దిన్ కసబ్‌ను కూడా టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ దాడులు సాగించింది. గాజా స్ట్రిప్‌లోని పలువురు గ్రూపుల సమన్వయ బాధ్యతలు నిర్వహించే కసబ్ మరణం పట్ల పాలస్తీనా అధికారులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ దాడిలో హమాస్ అధికారి అమాన్ అయేష కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.