Iran: టెహ్రాన్‌పై భీకర దాడులు.. ఇరాన్ టాప్ సైనిక నేతలు మృతి!
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ క్రమంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై యూఎస్ భీకర దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన పలువురు అగ్రశ్రేణి సైనికాధికారులు ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. టెహ్రాన్‌పై భారీ దాడులు జరిగాయి. ఇరాన్‌ను తప్పుదారి పట్టించిన ఆ దేశ సైనిక నాయకుల్లో పలువురు మరణించారని ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా పేర్కొన్నారు. అయితే మృతి చెందినవారి వివరాలను ఆయన వెల్లడించలేదు. ఈ దాడులకు సంబంధించిన వీడియోలను కూడా పంచుకున్నారు. దీనిపై ఇరాన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు. మరోవైపు, కువైట్‌పై కూడా ఇరాన్ తీవ్ర దాడులకు దిగింది.
వివరాలు
కువైట్ పై ఇరాన్ తీవ్ర దాడులు
షువైఖ్ ఆయిల్ సెక్టార్ కాంప్లెక్స్‌పై డ్రోన్ దాడి జరగడంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ కాంప్లెక్స్‌లో చమురు మంత్రిత్వశాఖతో పాటు కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఉన్నట్లు ఆ దేశ అధికారిక మీడియా తెలిపింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడుల్లో భారీ ఆస్తి నష్టం సంభవించినప్పటికీ, ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు రెస్క్యూ బృందాలు శ్రమిస్తున్నాయి. ఇదే సమయంలో దూసుకొస్తున్న క్షిపణులు, డ్రోన్‌లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకుంటున్నాయని కువైట్ సైన్యం పేర్కొంది. ఈ కారణంగానే నగరంలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయని తెలిపింది. కాగా కువైట్ నగరంలోని ఒక ప్రభుత్వ భవనంపై కూడా డ్రోన్ దాడి జరిగినట్లు సమాచారం.