Page Loader
సింగపూర్‌లో 20 ఏళ్ల తర్వాత తొలిసారి మహిళకు ఉరిశిక్ష
సింగపూర్‌లో 20 ఏళ్ల తర్వాత తొలిసారి మహిళకు ఉరిశిక్ష

సింగపూర్‌లో 20 ఏళ్ల తర్వాత తొలిసారి మహిళకు ఉరిశిక్ష

వ్రాసిన వారు Stalin
Jul 27, 2023
06:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

సింగపూర్‌లో అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరికి ఉరిశిక్ష పడినట్లు ఆ దేశ మానవ హక్కుల సంస్థ వెల్లడించింది. ఉరిశిక్ష పడినవారిలో ఒకరు మహిళ కాగా, మరొకొరు పురుషుడు. విశేషమేమిటంటే సింగపూర్‌లో 20ఏళ్ల తర్వాత ఓ మహిళకు ఉరిశిక్ష పడటం ఇదే తొలిసారి. ఉరిశిక్ష పడిన మహిళ పేరు సరిదేవీ జమానీ(45) కాగా, పురుషుడి పేరు మొహమ్మద్ అజీజ్ బిన్ హుస్సేన్ (56). 50 గ్రాముల (1.76 ఔన్సుల)హెరాయిన్ అక్రమ రవాణాకు పాల్పడిన కేసులో మొహమ్మద్ అజీజ్ బిన్ హుస్సేన్‌ను కోర్టు దోషిగా తేల్చింది. దాదాపు 30 గ్రాముల హెరాయిన్‌ స్మగ్లింగ్ కేసులో దోషిగా తేలడంతో 2018లో సరిదేవీ జమానీకి మరణశిక్ష పడింది.

సింగపూర్

సరిదేవీ జమానీకి రేపు ఉరి

అజీజ్ హుస్సేన్‌ను సింగపూర్‌లోని చాంగి జైలులో బుధవారం ఉరి తీశారు. అతని మృతదేహాన్ని ఖననం కూడా చేసినట్లు ట్రాన్స్‌ఫార్మేటివ్ జస్టిస్ కలెక్టివ్ కార్యకర్త కిర్‌స్టెన్ హాన్ చెప్పారు. సరిదేవీ జమానీని శుక్రవారం(జులై 28) ఉరి తీయనున్నారు. సింగపూర్‌లో చివరి సారిగా 2004లో మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో 36ఏళ్ల యెన్ మే వోన్ అనే మహిళను ఉరి తీశారు. ఆ తర్వాత ఒక మహిళను ఉరి తీయడం ఇదే మొదటిసారి కానుంది. సింగపూర్‌లో ప్రపంచంలోనే అత్యంత కఠినమైన మాదక ద్రవ్యాల వ్యతిరేక చట్టాలు ఉన్నాయి. డ్రగ్స్ కేసులో దోషిగా తేలితే అక్కడ మరణ శిక్షే శరణ్యం. డ్రగ్స్ నుంచి సమాజాన్ని రక్షించడానికి ఇలాంటి కఠినమైన చట్టాలు అవసరమని అక్కడి ప్రభుత్వం సమర్థించుకుంటోంది.

సింగపూర్

2022నుంచి ఆ దేశంలో 15మందికి ఉరి

సింగపూర్ చట్టం ప్రకారం, 15 గ్రాముల కంటే ఎక్కువ హెరాయిన్, 500 గ్రాముల కంటే ఎక్కువ గంజాయి అక్రమ రవాణాకు పాల్పడినట్లు నేరం రుజువైతే మరణశిక్ష పడుతుంది. సింగపూర్ మార్చి 2022లో ఉరిశిక్ష అమలును తిరిగి ప్రారంభించారు. అప్పటి నుంచి మాదకద్రవ్యాల నేరాలకు సంబంధించి కేసుల్లో 15 మందిని ఉరి తీసింది. ప్రతి నెల సగటున ఒక ఉరిశిక్ష అమలు చేయబడుతుందని ట్రాన్స్‌ఫర్మేటివ్ జస్టిస్ కలెక్టివ్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లాంటి మానవ హక్కుల సంస్థలు చెబుతున్నాయి. కఠినమైన మాదకద్రవ్యాల చట్టాలు సింగపూర్‌ను ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ప్రదేశాల్లో ఒకటిగా ఉంచడంలో సహాయపడతాయని అక్కడి అధికారులు వాదిస్తున్నారు.