పాకిస్థాన్: రికార్డు స్థాయిలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..!
పాకిస్థాన్ లో పెరుగుతున్నవిద్యుత్ ఛార్జీల నిరసనల మధ్య,దేశంలో పెట్రోలు,డీజిల్ ధరలు చరిత్రలో మొదటిసారిగా రూ.300 మార్క్‌ను దాటాయి. ఇది భయంకరమైన ఆర్థిక పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ప్రధానమంత్రి అన్వారుల్ హక్ కకర్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం గురువారం పెట్రోల్,హై-స్పీడ్ డీజిల్ (హెచ్‌ఎస్‌డి) ధరలను లీటరుకు రూ.14.91, రూ.18.44 చొప్పున పెంచింది. తాజా పెంపుతో ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.305.36గా ఉండగా,డీజిల్ ధర రూ.311.84కి చేరింది.విద్యుత్ బిల్లుల పెంపుపై ఇటీవల దేశంలో పెద్దఎత్తున నిరసనలు జరిగాయి. అనేక ప్రాంతాల్లో నిరసనలు,పెద్దఎత్తున ప్రదర్శనలు జరిగాయి.ప్రజలు తమ విద్యుత్ బిల్లులను తగలబెట్టడమే కాకుండా విద్యుత్ పంపిణీ సంస్థల అధికారులతోనూ వారు వాగ్వాదానికి దిగారు. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా ఇంతవరకు పరిష్కారం లభించలేదు.