Benjamin Netanyahu: నెతన్యాహు ఇంటిపై ఫ్లాష్ బాంబుల దాడి.. ప్రభుత్వం సీరియస్
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తర ఇజ్రాయెల్‌లోని సిజేరియా పట్టణంలో ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు నివాసంపై బాంబు దాడి జరగడం కలకలం రేపుతోంది. సిజేరియాలోని నెతన్యాహు నివాసంపై రెండు ఫ్లాష్ బాంబులు విసరడంతో అవి ఆయన ఇంటి తోటలో పేలినట్లు అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తూ దాడి సమయంలో నెతన్యాహు లేదా ఆయన కుటుంబ సభ్యులు అక్కడ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. టెల్ అవీవ్ రక్షణ మంత్రి కాట్జ్, ఈ దాడిని హద్దులు దాటే చర్యగా పేర్కొంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు.
గతంలో డ్రోన్ దాడులు
న్యాయశాఖ అధికారులను ఘటనపై దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కోరింది. గత నెలలో కూడా నెతన్యాహు నివాసం లక్ష్యంగా డ్రోన్ దాడులు జరిగిన తెలిసిందే. అయితే ఆ సమయంలో కూడా ఆయన, ఆయన సతీమణి నివాసంలో లేనందున పెద్ద నష్టం జరగలేదు. ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్ భద్రతా వ్యవస్థపై తరచుగా ఇలా దాడులు జరగడం, ఆ దేశం ఎదుర్కొంటున్న భద్రతా సవాళ్లను మరోసారి వెలుగులోకి తెచ్చింది.