Japan: జపాన్ విమానాశ్రయం స్టోర్ నుండి మిస్ అయ్యిన కత్తెర.. 236 కంటే ఎక్కువ విమానాలపై ప్రభావం
హక్కైడోలోని న్యూ చిటోషే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని స్టోర్ నుండి కత్తెర కనిపించకుండా పోవడంతో జపాన్‌లో గందరగోళం ఏర్పడింది. దీనివల్ల 236 కంటే ఎక్కువ విమానాలను ప్రభావితం అయ్యాయి. జపాన్ మీడియా ప్రకారం, ఈ సంఘటన ఆగస్టు 17, శనివారం ఉదయం 10 గంటలకు జరిగింది. ఇక్కడి డిపార్చర్ లాంజ్‌లోని ఓ దుకాణంలో కత్తెర కనిపించకపోవడంతో ప్రయాణికుల సెక్యూరిటీ చెకింగ్‌ను రెండు గంటలపాటు నిలిపివేశారు. దీంతో వందలాది మంది ప్రయాణికులు తాత్కాలికంగా అక్కడే చిక్కుకుపోవడంతో అలజడి మొదలైంది.
ప్రయాణికులను మళ్ళీ తనిఖీ చేశారు
లాంజ్‌లో భద్రతా చర్యల కారణంగా, ప్రయాణికులు మళ్లీ స్క్రీనింగ్ చేయించుకోవాల్సి వచ్చింది. ఈ సమయంలో ఇక్కడ చాలా పొడవైన క్యూ ఏర్పడింది. విమానాశ్రయంలో కత్తెర గురించి ఎంతసేపు వెతికిన అది కనిపించకపోవడంతో విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించారు. అయితే మరుసటి రోజు అదే దుకాణంలో కత్తెరను స్వాధీనం చేసుకున్నారు. 2 గంటల అంతరాయం కారణంగా అన్ని దేశీయ విమానాలు రద్దు చేయబడ్డాయి, దీనివల్ల 30 మంది ప్రయాణికులు విమానాశ్రయంలోనే రాత్రి గడిపారు.
36 విమానాలు రద్దు కాగా 201 ఆలస్యమయ్యాయి
నివేదికల ప్రకారం, దాదాపు 36 విమానాలు రద్దు చెయ్యగా .. 201 విమానాలు కత్తెరను వెతుకుతున్న ప్రక్రియలో ఆలస్యం అయ్యాయి. జపాన్ భూ, మౌలిక సదుపాయాలు, రవాణా, పర్యాటక మంత్రిత్వ శాఖ హక్కైడో విమానాశ్రయంలో ప్రమాదానికి కారణాన్ని పరిశోధించి, మళ్లీ జరగకుండా నిరోధించాలని కోరింది. జపాన్‌లోని అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో న్యూ చిటోషే ఒకటి. 2022లో 15 మిలియన్లకు పైగా ప్రయాణికులు ఈ విమానాశ్రయాన్ని ఉపయోగించారు.