Iran: యుద్ధ విరమణ తర్వాత టెహ్రాన్ నుంచి విమానాల పునఃప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియా ప్రాంతం రెండు నెలలుగా యుద్ధ భీకరతతో వణికిపోయింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేపట్టగా... ప్రతిగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై ప్రతీకార యుద్ధానికి దిగింది. దీంతో మధ్యప్రాచ్యం మొత్తం వైమానిక దాడులు, బాంబు దాడులతో దద్దరిల్లింది. పరిస్థితులు తీవ్రరూపం దాల్చడంతో ఇంటర్నెట్ సేవలతో పాటు గగనతలాన్ని కూడా ఇరాన్ మూసివేసింది. అయితే తాజాగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిరవధికంగా పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ పరిణామంతో ప్రాంతంలో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమేనీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వాణిజ్య విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి.
వివరాలు
రెండు నెలలుగా నిలిచిపోయిన విమాన రాకపోకలు
యుద్ధం కారణంగా రెండు నెలలుగా నిలిచిపోయిన విమానాల రాకపోకలు మళ్లీ ప్రారంభమవడంతో ఇరాన్‌లో చిక్కుకుపోయిన వారు ఊపిరి పీల్చుకున్నారు. స్వదేశాలకు తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. అధికారుల సమాచారం ప్రకారం, టెహ్రాన్ నుంచి ఇస్తాంబుల్, మస్కట్, మదీనాలకు విమానాలు బయలుదేరాయి. కాల్పుల విరమణ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఇదిలా ఉండగా, ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా మధ్య కీలక చర్చలు కొనసాగుతున్నాయి.
వివరాలు
ముఖాముఖీ సమావేశం కోరిన ఇరాన్
ఇప్పటికే ఇరాన్ ప్రతినిధి బృందం అక్కడికి చేరుకుని చర్చలు ప్రారంభించగా, అమెరికా బృందం శనివారం సాయంత్రానికి చేరుకోనుంది. ఈసారి అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాల్గొనడం లేదు. బదులుగా మధ్యప్రాచ్యానికి అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ మాత్రమే చర్చలకు హాజరవుతున్నారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవట్ వెల్లడించారు. చర్చల కోసం ఇరాన్ స్వయంగా ముందుకొచ్చిందని, ముఖాముఖి సమావేశం కోరిందని తెలిపారు. చర్చల వివరాలను తమ బృందం అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు తెలియజేస్తుందని చెప్పారు.