ఉత్తర ఇటలీని ముంచెత్తిన వరదలు; 9మంది మృతి; ఫార్ములా వన్ రేసు రద్దు
ఉత్తర ఇటలీలోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. వరదల ధాటికి 9మంది మృతి చెందారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వరదలు భయంకరంగా ఉండటంతో ఫార్ములా వన్ గ్రాండ్ ప్రి రేసు కూడా అక్కడి ప్రభుత్వం రద్దు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. భారీ వరదల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ఎమిలియా-రొమాగ్నా ప్రాంతంలో తొమ్మిది మంది మరణించారు. కొండచరియల విరిగిపడటం వల్ల వేలాది ఇళ్లను అక్కడి ప్రజలు ఖాళీ అయ్యాయి. కొన్ని ప్రాంతాలలో కేవలం 36 గంటల్లోనే సగటు వార్షిక వర్షపాతం సగం కురిసిందని, నదులు నిండి ప్రవహించాయని సివిల్ ప్రొటెక్షన్ మినిస్టర్ నెల్లో ముసుమెసి తెలిపారు. పట్టణాల్లో వీధుల గుండా నీరు ప్రవహించిందని, వేలాది ఎకరాల వ్యవసాయ భూములు మునిగిపోయాయని చెప్పారు.
విరిగిపడ్డ 120 కొండచరియలు
వరదల బీభత్సం వల్ల క్రైస్తవ వారసత్వ ప్రదేశాలకు ప్రసిద్ధి చెందిన అడ్రియాటిక్ తీర నగరమైన రవెన్నా తీవ్రంగా ప్రభావితమైంది. వరదల వల్ల దాదాపు 14,000 మందిని వీలైనంత త్వరగా ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయవలసి ఉంటుందని స్థానిక అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. 37 పట్టణాలు, కమ్యూనిటీలను వరదలు ముంచెత్తాయని, దాదాపు 120 కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు. బోలోగ్నా నగరానికి సమీపంలో ఒక వంతెన కూలిపోయింది. అనేక రోడ్లు దెబ్బతిన్నాయి. రైల్వే సేవలను నిలిపివేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ నదుల నీటి మట్టాలు పెరుగుతూనే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి