Vibrio vulnificus: ఫ్లోరిడాలో ప్రమాదకర వైరస్ ఉధృతి.. 13 మంది మృతి
ఫ్లోరిడాలో వైబ్రియో వల్నిఫికస్ (Vibrio vulnificus) అనే అరుదైన ఫ్లెష్-ఈటింగ్ బ్యాక్టీరియా ఉధృతంగా వ్యాపిస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 13 మంది ఈ బ్యాక్టీరియా కారణంగా మరణించారు. 2024లో మొత్తం 74 కేసులు నమోదయ్యాయి. గత ఏడాది కేవలం 46 కేసులు, 11 మరణాలు చోటుచేసుకున్నాయి. ఫ్లోరిడా ఆరోగ్య శాఖ ఈ కేసుల పెరుగుదలకి హరికేన్ హెలెన్ ప్రభావం ప్రధాన కారణమని చెబుతోంది. హరికేన్ హెలెన్ ఫ్లోరిడాను తాకినప్పుడు తీవ్రమైన ఈదురుగాలులు, భారీ అలల కారణంగా వైబ్రియో బ్యాక్టీరియా కేసులు పెరిగాయి. ముఖ్యంగా సిట్రస్, హెర్నాండో, హిల్స్‌బరో, లీ, పాస్కో, పినెల్లాస్, సరసోటా ప్రాంతాల్లో ఈ కేసులు అధికంగా నమోదయ్యాయి. అక్టోబర్ 9న హరికేన్ మిల్టన్ కూడా ఫ్లోరిడాపై ప్రభావం చూపింది.
గతంలో 74 మరణాలు
ఈ నేపథ్యంలో, ఆరోగ్య శాఖ 'వైబ్రియో బ్యాక్టీరియా కలుషిత నీటిలో ఉన్నప్పుడు లేదా ఆ నీరు తాగినప్పుడు శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుందని హెచ్చరించింది. భారీ వర్షపాతం, వరదలు వచ్చినప్పుడు, ముఖ్యంగా సముద్రపు నీటిలో లేదా కలుషిత నీటిలో ఈ బ్యాక్టీరియా మోతాదు ఎక్కువవుతుంది. ఒకసారి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఇది చర్మం, నరాల కణజాలాన్ని దెబ్బతీస్తుంది. తీవ్రమైన సందర్భాల్లో ఈ ఇన్ఫెక్షన్‌ను అరికట్టేందుకు శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు. కొన్నిసార్లు శరీర భాగాలను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే విధంగా గతంలో కూడా ఫ్లోరిడాలో ఈ బ్యాక్టీరియా వ్యాప్తి కేసులు నమోదయ్యాయి. 2022లో హరికేన్ ఇయాన్ ప్రభావంతో 74 కేసులు, 17 మరణాలు చోటుచేసుకున్నాయి.