Ford: కుకీ దొంగతనం ఆరోపణ.. రూ.1.9 కోట్ల జీతం ఉద్యోగిని తొలగించిన ఫోర్డ్
ఈ వార్తాకథనం ఏంటి
కుకీ దొంగిలించాడనే ఆరోపణతో ప్రముఖ వాహన తయారీ సంస్థ ఫోర్డ్‌లో భారీ జీతం పొందుతున్న ఓ ఉద్యోగిని తొలగించిన ఘటన అమెరికాలో చర్చనీయాంశంగా మారింది. తనపై తప్పుడు ఆరోపణలు చేసి ఉద్యోగం నుంచి తొలగించారని బాధిత ఉద్యోగి ఆరోపిస్తున్నాడు.బాధితుడు కర్ట్ క్రోమ్ (60). ఆయన అమెరికాలోని కెంటకీ రాష్ట్రం, లూయిస్‌విల్లేలో ఉన్న ఫోర్డ్ ట్రక్ ఫ్యాక్టరీలో గత 11 సంవత్సరాలుగా పనిచేస్తున్నట్లు తెలిపాడు. తాను సంస్థకు ఎంతో విధేయంగా పనిచేశానని, వారానికి సగటున 60 గంటలపాటు విధులు నిర్వహించేవాడినని చెప్పాడు. అయినప్పటికీ ఆధారాలు లేకుండానే తనపై ఆరోపణలు చేసి ఉద్యోగం నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశాడు.
వివరాలు
ఆఫీస్ క్యాంటీన్‌లోనే దాదాపు రూ.1.14 లక్షలు ఖర్చు
కంపెనీలో తన వార్షిక వేతనం సుమారు రూ.1.9 కోట్లు అని, గత ఏడాది ఒక్క ఆఫీస్ క్యాంటీన్‌లోనే దాదాపు రూ.1.14 లక్షలు ఖర్చు చేసినట్లు వెల్లడించాడు. ఇటీవల విధుల్లో ఉండగా షుగర్ స్థాయి తగ్గుతున్నట్లు అనిపించడంతో క్యాంటీన్‌లో రూ.186 విలువైన చాక్లెట్ కుకీ కొనుగోలు చేశానని తెలిపాడు. కొన్ని రోజుల తర్వాత సూపర్‌వైజర్ తనను పిలిచి ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు చెప్పాడని కర్ట్ వివరించాడు. కారణం అడగగా, చాక్లెట్ కుకీని దొంగిలించాడనే ఆరోపణతో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారని చెప్పాడు. అయితే తాను కుకీని దొంగిలించలేదని, కొనుగోలు చేసినట్లు బిల్లు కూడా తన వద్ద ఉందని చెప్పినా పట్టించుకోకుండా బలవంతంగా ఫ్యాక్టరీ ప్రాంగణం నుంచి బయటకు పంపించారని ఆరోపించాడు.
వివరాలు
అవమానించిన సంస్థలో మళ్లీ పనిచేయాలనే ఆసక్తి లేదు: కర్ట్
ఆ తర్వాత కుకీ కొనుగోలు చేసిన బిల్లు స్క్రీన్‌షాట్‌ను సంబంధిత అధికారులకు పంపినట్లు కర్ట్ తెలిపాడు. దీంతో తాను ఎలాంటి తప్పు చేయలేదని తేలిన అనంతరం, తిరిగి ఉద్యోగంలో చేరాలని యూనియన్ ప్రతినిధి తనను సంప్రదించినట్లు వెల్లడించాడు. అయితే తనను అవమానించిన సంస్థలో మళ్లీ పనిచేయాలనే ఆసక్తి లేదని కర్ట్ స్పష్టం చేశాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పూర్తి ఆధారాలు పరిశీలించకుండానే ఉద్యోగిపై చర్యలు తీసుకున్న ఫోర్డ్ అధికారుల తీరుపై పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.