Ukraine: ఉక్రెయిన్‌లో వాణిజ్య నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్‌లోని ఒడెసా ఓడరేవు నుంచి బయల్దేరిన ఎంవీ గోల్డెన్ లియో అనే వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో నలుగురు భారతీయులు సహా మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలి ఘటనగా విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ ఘటనపై భారత్ సోమవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ దాడిని ఖండించింది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరపడం, అమాయక పౌరుల ప్రాణాలు బలితీయడం అత్యంత దురదృష్టకరమని పేర్కొంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే ఈ దాడికి బాధ్యులు ఎవరో అధికారికంగా వెల్లడించలేదు.
వివరాలు
నౌకలో 17 మంది సిబ్బంది
ప్రమాదం సంభవించిన సమయంలో నౌకలో ఐదుగురు భారతీయులు సహా మొత్తం 17 మంది సిబ్బంది ఉన్నారు.
వారిలో నలుగురు భారతీయులు మృతి చెందగా, మరో భారతీయుడు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
శనివారం ఈ దాడి జరిగినట్లు తెలిపింది. ఇదిలా ఉండగా, తమ సముద్ర జలాల్లో ప్రయాణిస్తున్న ఓ నౌకపై రష్యా దాడి చేసిందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి అండ్రీ సైబిహా ఆరోపించారు.
ఆ నౌకలో భారతీయులు, సిరియా పౌరులు సహా పలువురు సిబ్బంది ఉన్నారని ఆయన వెల్లడించారు.