France: క్రూజ్ నౌకలో నోరోవైరస్ కలకలం.. నౌకలో చిక్కుకున్న 1700 మంది..
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్ నుంచి స్పెయిన్‌కు బయల్దేరిన 'యాంబిషన్' క్రూజ్ నౌకలో నోరోవైరస్ అనుమానిత లక్షణాలు బయటపడటంతో ఆందోళన నెలకొంది. ఈ ఘటనలో 90 ఏళ్ల వృద్ధుడు మృతి చెందగా, నౌకను ఫ్రాన్స్‌లోని బోర్డెక్స్ తీరంలో నిలిపివేశారు. నౌకలో ఉన్న సుమారు 1,700 మందికిపైగా ప్రయాణికులు, సిబ్బందిని అప్రమత్తంగా నౌకలోనే నిర్బంధించారు. ఇప్పటికే మరో 50 మందిలో వైరస్‌కు సంబంధించిన లక్షణాలు కనిపించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో వైద్య బృందాలు పరిస్థితిని దగ్గర నుంచి పర్యవేక్షిస్తున్నాయి.
వివరాలు
'వాంతుల వ్యాధి'గా నోరోవైరస్
ఇటీవల ఎంవీ హొండియస్ నౌకలో హంటా వైరస్ వ్యాప్తితో ముగ్గురు మరణించిన ఘటన మరవకముందే ఈ సంఘటన చోటుచేసుకోవడం కలవరపెడుతోంది. అయితే ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన నోరోవైరస్ ఘటనకు హంటా వైరస్‌తో ఎలాంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు. నోరోవైరస్‌ను సాధారణంగా 'వాంతుల వ్యాధి'గా పిలుస్తారు. కలుషితమైన ఆహారం లేదా నీటి ద్వారా ఈ వైరస్ శరీరంలోకి చేరుతుందని అమెరికా వ్యాధి నియంత్రణ సంస్థ వెల్లడించింది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వయసుల వారికీ ఇది సోకే అవకాశం ఉంటుంది. విరేచనాలు,వాంతులు,కడుపునొప్పి,వికారం,జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే చాలామంది బాధితులు ప్రత్యేక చికిత్స అవసరం లేకుండానే కొద్ది రోజుల్లో కోలుకుంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు.