French Pilot Detained: చైనాతో రహస్య సంబంధాలు.. పోలీసుల అదుపులో ఫ్రాన్స్ మాజీ పైలట్
ఈ వార్తాకథనం ఏంటి
చైనాకు సున్నితమైన సైనిక సమాచారాన్ని చేరవేశారనే ఆరోపణలతో ఫ్రాన్స్ మాజీ నేవీ పైలట్ పియర్-హెన్రీ చ్యూయెట్‌ను ఫ్రాన్స్ దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకుని విచారించాయి. విచారణ అనంతరం ఆయనను విడుదల చేసినప్పటికీ, ఈ కేసులో దర్యాప్తు మాత్రం కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. చైనా కోసం గూఢచర్యానికి పాల్పడ్డారనే అనుమానాలపై పారిస్ ప్రాసిక్యూటర్లు సమగ్ర విచారణ ప్రారంభించారు. సున్నితమైన సైనిక సమాచారాన్ని సేకరించి చైనా ఏజెంట్లకు అందించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. అంతేకాక, ఫ్రాన్స్‌కు చెందిన కీలక మిలిటరీ సమాచారాన్ని చైనాకు విక్రయించి ఉండొచ్చని పారిస్ అధికారులు అనుమానిస్తున్నారు. ఇక 'ఆపరేషన్ సిందూర్' సందర్భంగా పియర్-హెన్రీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర వివాదానికి దారితీశాయి.
వివరాలు
చైనాకు చెందిన యుద్ధ విమానాలను ప్రశంసించిన పియర్-హెన్రీ
భారత వైమానిక దళం రఫెల్ యుద్ధ విమానాలను కోల్పోయిందని ఆయన చేసిన వ్యాఖ్యలు విమర్శలకు గురయ్యాయి.
అదే సమయంలో చైనాకు చెందిన యుద్ధ విమానాలను ప్రశంసిస్తూ మాట్లాడడం కూడా చర్చనీయాంశమైంది.
ఆ సమయంలో చైనాకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన పియర్-హెన్రీ, ఇప్పుడు అదే దేశానికి గూఢచర్యం చేశారనే ఆరోపణలను ఎదుర్కొంటుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఫ్రెంచ్ సైన్యంలో సేవలందిస్తున్న సమయంలో అధికారుల అనుమతి లేకుండానే చైనా వెళ్లినట్లు కూడా దర్యాప్తులో వెల్లడైంది.
అక్కడ చైనా మిలిటరీ పైలట్లకు యుద్ధ విమానాలపై శిక్షణ ఇచ్చారని, కీలక రక్షణ సంబంధిత రహస్యాలను పంచుకున్నారనే ఆరోపణలు కూడా ఆయనపై నమోదయ్యాయి.
ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించిన అన్ని కోణాల్లో ఫ్రాన్స్ దర్యాప్తు సంస్థలు విచారణ కొనసాగిస్తున్నాయి.