
Sexual Abuse: ఫ్రాన్స్‌లో 300 మంది చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడిన మాజీ సర్జన్
ఈ వార్తాకథనం ఏంటి
ఒక వైద్యుడి బాధ్యత రోగులను నయం చేయడమే కాని, ఆయన కీర్తిని మసకబార్చేలా మానవత్వాన్ని కోల్పోయాడు.
ఫ్రాన్స్‌లో (France) వెలుగులోకి వచ్చిన ఈ ఘోరమైన ఘటనలో, 74 ఏళ్ల జోయెల్ లీ స్కౌర్నెక్ అనే శస్త్రచికిత్స నిపుణుడు (Surgeon), తన వైద్య సేవల కవచంలో దాచుకున్న అసలైన మృగంగా మారాడు.
మూడు దశాబ్దాల పాటు తన వద్దకు వచ్చిన రోగులకు సహాయపడే బదులుగా, అత్యాచారాలకు పాల్పడ్డాడు.
అత్యంత విషాదకరమైన విషయం ఏమిటంటే, బాధితుల్లో అధికంగా చిన్నారులే ఉండడం.
వివరాలు
అతని ఇంట్లో 3 లక్షల ఫోటోలు… విచారణలో షాకింగ్ నిజాలు
ఫ్రాన్స్‌లోని బ్రిటానీ ప్రాంతంలో ఒక ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిపుణుడిగా పనిచేసిన జోయెల్, 30 ఏళ్లపాటు అనేక మంది రోగులపై లైంగిక దాడులు చేశాడు.
అతని అమానుష చర్యలు 2017లో బయటపడ్డాయి. తన ఇంటి పక్కనే ఉన్న ఆరేళ్ల చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించడంతో అతనిపై కేసు నమోదైంది.
ఈ దర్యాప్తులో భాగంగా పోలీసులు అతని ఇంట్లో సోదాలు నిర్వహించగా, మూడు లక్షలకు పైగా ఫోటోలు, 650కు పైగా అశ్లీల వీడియోలు బయటపడ్డాయి.
అతని వ్యక్తిగత డైరీలు పరిశీలించిన పోలీసులు మరింత ఆశ్చర్యానికి గురయ్యారు.
తన కిరాతక చర్యలను సవివరంగా రాసుకున్న డైరీలు, చిన్నారులపై జరిగిన దారుణాలను స్పష్టంగా వెల్లడించాయి.
అంతేకాకుండా, జంతువుల పట్ల కూడ అతని ఆకర్షణ తప్పుదోవ పట్టినదని వెల్లడైంది.
వివరాలు
299 మందిపై లైంగిక దాడి
2020లో నలుగురు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో జోయెల్ దోషిగా తేలి 15 ఏళ్ల జైలుశిక్షకు గురయ్యాడు.
అయితే, ఈ కేసును మరింత లోతుగా విచారించగా, అతడి మరిన్ని పాపాలు వెలుగు చూశాయి.
బాధితుల్లో చాలామందికి తాము ఓ బలాత్కార ఘటనకు గురైన విషయం తెలియకపోవడం గమనార్హం.
అతని డైరీల్లో తమ పేర్లు చూసిన తరువాతే తాము బాధితులమని వారికి తెలిసిందని చాలా మంది బాధితులు వేదన వ్యక్తం చేశారు.
వివరాలు
నేరం అంగీకరించిన నిందితుడు
తాజా విచారణలో అతడు కోర్టు ముందు తానే నేరస్తుడినని అంగీకరించాడు.
1989 నుంచి 2014 మధ్య 158 మంది బాలురు, 141 మంది బాలికలపై లైంగిక దాడి చేసినట్లు న్యాయస్థానంలో వెల్లడించాడు.
అతని మాటల్లోనే, "నేను చేసిన పనులు అమితమైన నష్టం చేకూర్చాయి. ఆ చిన్నారుల మనసులో మిగిలిపోయిన గాయం జీవితాంతం మానదు. నా చర్యలకు పూర్తిగా బాధ్యత వహిస్తున్నా" అని చెప్పాడు. ప్రస్తుతం కోర్టు విచారణ కొనసాగుతుండగా, అతడికి మరో 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశముందని తెలుస్తోంది.