Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస.. 50కి పైగా ఇళ్లకు నిప్పు.. అవామీ లీగ్ ఆస్తులే లక్ష్యం!
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్‌లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా డిసెంబర్‌లో స్వదేశానికి తిరిగి వస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఆ దేశంలో ఉద్రిక్తతలు పెరిగాయి. పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు, దహనాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో నరైల్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వారం ప్రారంభంలో ఓ పార్టీ ర్యాలీపై జరిగిన దాడిలో అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ)కి చెందిన నేతలు మరణించారు. ఈ ఘటన తర్వాత 50కి పైగా ఇళ్లతో పాటు పలు దుకాణాలకు దుండగులు నిప్పుపెట్టారు. షేక్ హసీనాకు చెందిన నిషేధిత అవామీ లీగ్ పార్టీ నేతలు, కార్యకర్తల ఆస్తులనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
వివరాలు
అవామీ లీగ్ వర్సెస్ బీఎన్పీ.. మళ్లీ బయటపడిన విభేదాలు
శుక్రవారం మధ్యాహ్నం కలియా మున్సిపాలిటీ పరిధిలోని బెండార్ చార్ గ్రామంలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.
మాజీ అవామీ లీగ్ ఎంపీ కబీరుల్ హక్ ముక్తికి చెందిన పూర్వీకుల ఇళ్లకు కూడా నిప్పంటించారు. బంగ్లాదేశ్ రాజకీయాల్లో అవామీ లీగ్, బీఎన్పీ మధ్య ఎన్నో ఏళ్లుగా రాజకీయ శత్రుత్వం కొనసాగుతోంది.
తాజాగా జరుగుతున్న పరిణామాలతో ఈ విభేదాలు మరోసారి బహిరంగంగా కనిపిస్తున్నాయి. షేక్ హసీనా భారత్‌కు వచ్చిన తర్వాత, ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో బీఎన్పీ విజయం సాధించింది. తారిక్ రెహ్మాన్ అధికారాన్ని చేపట్టారు.
అయితే తాజాగా జరుగుతున్న దాడులు అవామీ లీగ్‌ను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బంగ్లాదేశ్ స్టూడెంట్ లీగ్ అధ్యక్షుడు హుస్సేన్ సద్దాం ఈ ఘటనలపై సంచలన ఆరోపణలు చేశారు.
వివరాలు
షేక్ హసీనా రాక ప్రకటనతో పెరిగిన ఉద్రిక్తతలు
అవామీ లీగ్ మద్దతుదారులకు చెందిన వందలాది ఇళ్లను స్థానిక బీఎన్పీ కార్యకర్తలు తగలబెట్టారని ఆరోపించారు.
ఇళ్లను ధ్వంసం చేయడంతో పాటు విలువైన వస్తువులను దోచుకున్నారని పేర్కొన్నారు.
బాధితుల్లో హిందూ మైనారిటీ కుటుంబాలు కూడా ఉన్నాయని చెప్పారు. మాజీ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా స్వదేశానికి తిరిగి వస్తున్నట్లు ప్రకటించడంతో ఆ దేశంలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి.
డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానని ఆమె వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆమె మద్దతుదారులు, అవామీ లీగ్, దాని అనుబంధ సంస్థల కార్యకర్తలు దేశంలో నిరసనలు చేపడుతున్నారు.
ఇటీవల వరుసగా బాంబు దాడులు, ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ దాడుల వెనుక అవామీ లీగ్ ఉందని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.