Israel : గాజా ప్రజలకు ఇజ్రాయెల్ డెడ్‌లైన్.. మరో 3 గంటల్లో గ్రౌండ్ ఆపరేషన్
ఇజ్రాయెల్ క్షేత్రస్థాయిలో యుద్ధం చేసేందుకు విధించిన గడువు దగ్గరపడింది. ఈ మేరకు మరో 3 గంటల్లో గాజా ప్రజలు పూర్తిగా నగరాన్ని ఖాళీ చేయాల్సి ఉంది. పాలస్తీనా హమాస్ ఉగ్రవాదులను పూర్తిగా అంతం చేసేందుకు ఇజ్రాయిల్ మిలిటరీ బలగాలు రెడీగా ఉన్నాయి. శనివారం పదాతిదళాలను కలిసిన ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ, రెండో దశకు సన్నద్ధమయ్యారా అని అడిగారు. ఈ క్రమంలోనే ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై భీకరపోరుకు సర్వసన్నద్ధమైనట్లు కనిపిస్తుంది. ఉత్తర గాజా నుంచి దక్షిణ వైపునున్న సురక్షిత ప్రాంతాలకు వలసలు వెళ్లేందుకు గాజా ప్రజలకు మరో 3 గంటలే మిగిలి ఉంది. ఒక్కసారి ఆపరేషన్ ప్రారంభమయ్యాక ఆ ప్రాంతమంతా ''యాక్టివ్ కంబాట్ జోన్''గా మారుతుందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ హెచ్చరించింది.
అన్ని మార్గాల్లో భీకర దాడికి సిద్ధమైన ఇజ్రాయెల్
గాజా స్ట్రిప్ లో వాయు, భూమి, నావికాదళాలతో కూడిన సంయుక్త దాడులకు రెఢీగా ఉన్నామని ఐడీఎఫ్ ప్రకటించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎటువంటి ఆపరేషన్స్ చేయమని ఇజ్రాయిల్ ఆర్మీ పేర్కొంది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు కారిడార్ తెరిచామని, గాజాలో నివాసితులు, వారి కుటుంబాల భద్రత కూడా కీలకమని వివరించింది. హమాస్ ఉగ్రవాదులు ప్రజల్ని మానవ కవచాలుగా వాడుకునేందుకు యత్నిస్తోందని ఐడీఎఫ్ ఆరోపించింది. ఈ మేరకు గాజా వాసులు సేఫ్ జోన్లకు వెళ్లిపోకుండా హమాస్ తీవ్రవాదులు అడ్డుకుంటున్న చిత్రాలను ఇజ్రాయిల్ రిలీజ్ చేసింది. గత శనివారం ఇజ్రాయిల్ పై హమాస్ అనుహ్యంగా భీకరమైన దాడి చేసింది.