
Donald Trump: బగ్రామ్ ఎయిర్‌బేస్ తిరిగి ఇవ్వండి.. అఫ్గాన్‌కు ట్రంప్ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)అఫ్గానిస్థాన్‌పై తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల ఆయన బగ్రామ్ ఎయిర్‌బేస్(Bagram Air Base)ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని సంకేతాలిచ్చిన విషయం తెలిసిందే. ఆ ఎయిర్‌బేస్‌ను అమెరికాకు తిరిగి ఇవ్వకపోతే అఫ్గాన్‌పై కఠిన చర్యలు తీసుకుంటానని స్పష్టంగా తెలిపారు. ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదిక 'ట్రూత్ సోషల్'(Truth Social)లో పోస్ట్ చేస్తూ, అమెరికా నిర్మించిన బగ్రామ్ ఎయిర్‌బేస్‌ను తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే తాను తీసుకునే చర్యలు చాలా కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ అంశంపై విలేకరులతో మాట్లాడిన ఆయన.. బగ్రామ్ ఎయిర్‌బేస్ స్వాధీనం విషయంపై అఫ్గాన్‌తో చర్చలు జరుపుతాం. అది మాకు తిరిగి రాకపోతే నేను ఏం చేస్తానో ఎవరూ ఊహించలేరన్నారు.
Details
సమధానం ఇవ్వకుండా వెళ్లిపోయిన ట్రంప్
అమెరికా దళాలను అక్కడికి పంపిస్తారా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు మాత్రం ట్రంప్ సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన బగ్రామ్ ఎయిర్‌బేస్ చైనా అణు క్షిపణులు తయారు చేసే కేంద్రాలకు అతి దగ్గరగా ఉందని, అక్కడి నుంచి కేవలం గంటలోనే ఆ ప్రాంతాలకు చేరవచ్చని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు.ట్రంప్ వ్యాఖ్యలపై బీజింగ్ స్పందించింది. అఫ్గాన్ భవిష్యత్తు అక్కడి ప్రజల చేతుల్లోనే ఉందని, ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచడం వల్ల ఎటువంటి మద్దతు లభించదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ స్పష్టం చేశారు. ఇదే అంశంపై అఫ్గాన్ అధికారులు కూడా అమెరికా నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు.