LOADING...
Iran: యుద్ధం నిలిపేందుకు ఇజ్రాయెల్‌, అమెరికాలపై ప్రపంచ ఒత్తిడి అవసరం: ఇరాన్ ప్రతినిధి
యుద్ధం నిలిపేందుకు ఇజ్రాయెల్‌, అమెరికాలపై ప్రపంచ ఒత్తిడి అవసరం: ఇరాన్ ప్రతినిధి

Iran: యుద్ధం నిలిపేందుకు ఇజ్రాయెల్‌, అమెరికాలపై ప్రపంచ ఒత్తిడి అవసరం: ఇరాన్ ప్రతినిధి

వ్రాసిన వారు Sirish Praharaju
May 03, 2026
11:31 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌లో ఉన్న ఇరాన్ సుప్రీం నాయకుడి ప్రతినిధి అబ్దుల్ మాజిద్ హకీమ్ ఇలాహి కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధాన్ని ఆపేందుకు ఇజ్రాయెల్, అమెరికాలపై ప్రపంచ దేశాలు ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం యుద్ధం ముగియక, శాంతి నెలకొనక మధ్యంతర పరిస్థితి కొనసాగుతోందని చెప్పారు. సాధారణ పరిస్థితులు పునరుద్ధరించడం యుద్ధాన్ని ప్రారంభించిన వారి చేతుల్లోనే ఉందని ఆయన స్పష్టం చేశారు. దిల్లీలో విలేకరులతో మాట్లాడిన ఇలాహి, ఈ యుద్ధాన్ని ఇరాన్ అసలు కోరుకోవడం లేదని తెలిపారు. ఘర్షణలను నివారించేందుకు తమవంతు ప్రయత్నాలు చేశామని, అయితే నిరంతర దాడుల కారణంగా ప్రతిస్పందించాల్సి వచ్చిందని చెప్పారు. అమెరికా, ఇజ్రాయెల్‌కు ఈ విధంగా దాడులు చేసే అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు.

వివరాలు 

యుద్ధం వల్ల నాలుగు వేల మంది మృతి 

చర్చలు ముందుకు సాగుతున్న సమయంలోనే భారీ దాడులు జరిపి, సుప్రీం నాయకుడు సహా అనేక మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారులు సహా సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు. మొత్తం నాలుగు వేల మంది మరణించగా, మరో నలభై వేల మంది ఇరాన్ పౌరులు గాయపడ్డారని వెల్లడించారు. అనేక మౌలిక సదుపాయాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.

వివరాలు 

ఈ దాడుల వల్ల ప్రతి ఒక్కరూ నష్టపోతున్నారు

బేషరతుగా లొంగిపోవాలని అమెరికా, ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తున్నాయని, దాన్ని ఎవరూ అంగీకరించరని ఆయన స్పష్టం చేశారు. పరిష్కార మార్గాలపై ఇరాన్‌ను ప్రశ్నించకుండా, ఈ ఘర్షణలకు కారణమైన దేశాలనే యుద్ధం ఆపాలని కోరాలని సూచించారు. ఈ దాడుల వల్ల ప్రతి ఒక్కరూ నష్టపోతున్నారని అన్నారు. ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చివేయడమే వారి అసలు ఉద్దేశమని ఆరోపించారు. అయితే ఆ ప్రయత్నం ఎప్పటికీ ఫలించదని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement