LOADING...
Bolivia: బొలీవియాలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం.. సైన్యానికి ప్రత్యేక అధికారాలు
బొలీవియాలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం.. సైన్యానికి ప్రత్యేక అధికారాలు

Bolivia: బొలీవియాలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం.. సైన్యానికి ప్రత్యేక అధికారాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 21, 2026
04:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ అమెరికా దేశమైన బొలీవియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అధ్యక్షుడు రోడ్రిగో పాజ్ శనివారం దేశవ్యాప్తంగా అత్యయిక స్థితి (ఎమర్జెన్సీ)ని ప్రకటించారు. ఈ నిర్ణయంతో ప్రధాన నగరాల్లో కొనసాగుతున్న ఇంధన, ఆహార సరఫరాల దిగ్బంధనాలను తొలగించే ప్రత్యేక అధికారాలు సైన్యానికి అప్పగించారు. దేశంలో ఇంధన సబ్సిడీల రద్దు సహా పలు పొదుపు చర్యలను ప్రభుత్వం అమలు చేయడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అధ్యక్షుడు పాజ్ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తూ గత ఐదు వారాలుగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి.

వివరాలు

నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు

ఈ ఆందోళనల సందర్భంగా పలు ప్రాంతాల్లో నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో 37 మంది గాయపడగా, 365 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు, ఆందోళనకారులు రహదారులను దిగ్బంధించడంతో రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. అత్యవసర వైద్య సేవలకు అంతరాయం ఏర్పడటంతో 17 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. రోడ్ల దిగ్బంధనాల కారణంగా దేశంలో ఇంధన, ఆహార సరఫరాలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించే నిర్ణయం తీసుకుంది.

వివరాలు

పూర్తిగా నిలిచిపోయిన వ్యాపార కార్యకలాపాలు

ఈ సందర్భంగా అధ్యక్షుడు రోడ్రిగో పాజ్ మాట్లాడుతూ, "ఇది ప్రజల జీవితాలను నియంత్రించడానికి విధించిన ఎమర్జెన్సీ కాదు. ప్రజలకు స్వేచ్ఛను కల్పించడానికి తీసుకున్న నిర్ణయమని పేర్కొన్నారు. ఆందోళనల వల్ల వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయాయని, ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరా కూడా సంక్షోభంలో పడిందని, సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడానికే ఈ చర్య చేపట్టినట్లు వివరించారు. అత్యయిక స్థితి 90 రోజులపాటు అమల్లో ఉంటుందని, అయితే హింసాత్మక ఘటనలు తగ్గి పరిస్థితులు సాధారణ స్థితికి వస్తే ముందుగానే ఎత్తివేస్తామని ఆయన తెలిపారు.

Advertisement

వివరాలు

ప్రజల్లో పెరిగిన అసంతృప్తి

అధ్యక్ష పదవిలోకి రాకముందు దేశంలోని ఇంధన సంక్షోభాన్ని పరిష్కరిస్తానని, ఆర్థికంగా బలహీనపడిన సెంట్రల్ బ్యాంక్‌కు ఊతమిస్తానని పాజ్ హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పొదుపు చర్యల పేరుతో ఇంధన సబ్సిడీలను ఎత్తివేయడంతో ప్రజల్లో అసంతృప్తి మరింత పెరిగి, ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలకు దారితీసింది.

Advertisement