పాక్ ఆర్థిక తిప్పలు; న్యూయార్క్‌లోని రూజ్‌వెల్ట్ హోటల్ ను లీజుకిచ్చిన దాయాది దేశం
ఆర్థిక కష్టాలను అధిగమించేందుకు పాకిస్థాన్ అష్టకష్టాలు పడుతోంది. చివరికి విదేశాల్లో తమ దేశ ఆస్థులను కుదువ పెట్టే దయనీయ స్థితికి పాక్ చేరుకుంది. తాజాగా న్యూయార్క్‌లోని ఐకానిక్ రూజ్‌వెల్ట్ హోటల్‌ను స్థానిక సిటీ అడ్మినిస్ట్రేషన్‌కు పాకిస్థాన్ మూడేళ్లపాటు లీజుకు ఇచ్చింది. ఈ లీజు ద్వారా పాక్ ప్రభుత్వం, 220 మిలియన్ డాలర్ల వరకు సమకూర్చుకోనుంది. 1924లో న్యూయార్క్‌లోని మాన్‌హాటన్‌లో మాజీ అధ్యక్షుడు థియోడర్ రూజ్‌వెల్ట్ పేరుతో హోటల్‌ను అమెరికా ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ హోటల్‌ను పాక్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) 1979లో లీజుకు తీసుకుంది. రెండు దశాబ్దాల తర్వాత దానిని కొనుగోలు చేసింది.
పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేసే ప్రణాళికలో భాగంగానే ఈ ఒప్పందం
తాజాగా న్యూయార్క్ నగర పరిపాలన అధికారుల నివాస సౌకర్యాల కోసం మూడేళ్లపాటు లీజుకు ఇచ్చింది. ఈ మేరకు ఒప్పందం కూడా జరిగింది. లీజు ఒప్పందం వల్ల పాకిస్థాన్ ప్రభుత్వానికి దాదాపు 220 మిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని రైల్వే, విమానయాన శాఖ మంత్రి ఖవాజా సాద్ రఫీక్ ప్రకటించారు. 1,250 గదుల కోసం ఈ ఒప్పందం జరిగింది. మూడేళ్ల లీజు గడువు ముగియగానే హోటల్‌ను పాకిస్తాన్ ప్రభుత్వానికి తిరిగి ఇవ్వబడుతుందని జియో టీవీ పేర్కొంది. 2020లో మహమ్మారి సమయంలో హోటల్ మూసివేయబడింది. వలస వచ్చిన వారి కోసం ఈ సంవత్సరం ప్రారంభంలో దీన్ని తిరిగి తెరిచారు. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేసే ప్రణాళికలో భాగంగానే రూజ్‌వెల్ట్ హోటల్‌ను ప్రభుత్వం లీజుకు ఇచ్చినట్లు తెలుస్తోంది.