
Thailand-Cambodia Conflict: థాయ్‌లాండ్-కంబోడియా మధ్య శాంతి చర్చలకు గ్రీన్ సిగ్నల్.. ట్రంప్ కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
థాయ్‌లాండ్-కంబోడియా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగప్రవేశం చేశారు. తన మధ్యవర్తిత్వం వల్లే ఈ యుద్ధానికి ముగింపు కనిపించిందని ట్రంప్ ప్రకటించారు. రెండు దేశాలు తక్షణ కాల్పుల విరమణ చర్చలకు అంగీకరించాయని ఆయన వెల్లడించారు. ఈ మేరకు ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా వేదికగా స్పందించారు. కంబోడియా ప్రధాని హున్ మానెట్, థాయ్‌లాండ్ తాత్కాలిక ప్రధాని ఫుమ్తామ్ వెచాయాచాయ్‌లతో తాను మాట్లాడినట్టు తెలిపారు. శాంతి స్థాపన కోసం ఇరు దేశాలు త్వరలో సమావేశమై చర్చలు నిర్వహించేందుకు అంగీకరించాయని పేర్కొన్నారు.
Details
నిజాయితీగా వ్యవహరించాల్సి ఉంది
అయితే ఈ చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరించేది ఎవరు? చర్చలు ఎక్కడ జరుగుతాయి? అన్న అంశాలపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇక కాల్పుల విరమణపై థాయ్‌లాండ్ తాత్కాలిక ప్రధాని ఫేస్‌బుక్‌లో స్పందించారు. తాము సూత్రప్రాయంగా ఒప్పుకున్నామని తెలిపారు. అయితే కంబోడియా నిజాయితీగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు. మరోవైపు, ఈ ఘర్షణలు కొనసాగితే అమెరికాతో ఉన్న వాణిజ్య ఒప్పందాలు ప్రమాదంలో పడతాయని ట్రంప్ హెచ్చరించారు. గతంలో ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధాన్ని, భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పులను తన మద్ధతుతోనే నిలిపినట్లు పలుమార్లు ప్రకటించిన ట్రంప్.. ఇప్పుడు థాయ్‌లాండ్-కంబోడియా మధ్య చర్చల కోసం తన పాత్రను హైలైట్ చేస్తూ మరోసారి వార్తల్లోకెక్కారు.