LOADING...
Pakistan: పాక్‌ స్వాతంత్య్ర వేడుకల్లో గన్‌ఫైర్‌ సంబరాలు… ఎనిమిదేళ్ల చిన్నారి సహా ముగ్గురు మృతి!
పాక్‌ స్వాతంత్య్ర వేడుకల్లో గన్‌ఫైర్‌ సంబరాలు… ఎనిమిదేళ్ల చిన్నారి సహా ముగ్గురు మృతి!

Pakistan: పాక్‌ స్వాతంత్య్ర వేడుకల్లో గన్‌ఫైర్‌ సంబరాలు… ఎనిమిదేళ్ల చిన్నారి సహా ముగ్గురు మృతి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 14, 2025
09:53 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు తీవ్ర విషాదంలో ముగిశాయి. కరాచీ నగరవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో గన్‌ఫైర్‌తో సంబరాలు జరుపుకోవడంతో ఎనిమిదేళ్ల చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన తుపాకీ కాల్పుల్లో 64 మంది గాయపడ్డారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. పాకిస్థాన్‌లో పండుగలు, ప్రత్యేక వేడుకల సందర్భంగా తుపాకులు చేతపట్టి గాల్లోకి కాల్పులు జరపడం (Celebratory Firing) సర్వసాధారణం. గతేడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో ఇలాంటి కాల్పుల వల్ల 95 మందికి గాయాలు కాగా, అంతకుముందు సంవత్సరం 80 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Details

20 మంది అనుమానితులు అరెస్టు

తాజా వేడుకల్లో కరాచీలోని లియాఖతాబాద్‌, కోరంగి, మెహబూబాబాద్‌, అఖ్తర్‌ కాలనీ, బాల్దియా, ఓరంగీ టౌన్‌ వంటి ప్రాంతాల్లో గన్‌ఫైర్‌ జరిగింది. అజీజాబాద్‌లో తూటా తగిలి ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోగా, కోరంగి ప్రాంతంలో ఓ వృద్ధుడు మరణించాడు. ఈ ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు 20 మంది అనుమానితులను అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నదని పేర్కొన్నారు. అదేవిధంగా, నిందితుల వద్ద నుంచి అత్యాధునిక ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిర్లక్ష్యంగా, భయభ్రాంతులకు గురిచేసే ఈ చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.