మెక్సికోలో తుపాకీ కాల్పులు; 10 మంది రేసర్లు మృతి
ఉత్తర మెక్సికోలోని బాజా కాలిఫోర్నియాలో శనివారం జరిగిన కార్ షోలో జరిగిన కాల్పుల్లో కనీసం 10 మంది రేసర్లు మృతి చెందారు. తొమ్మిది మంది గాయపడినట్లు అధికారులు ప్రకటించారు. బాజా కాలిఫోర్నియా స్టేట్ అటార్నీ జనరల్ ఆఫీస్ ప్రకారం, ఎన్సెనాడా నగరంలోని శాన్ విసెంటే ప్రాంతంలో ఆల్-టెరైన్ కార్ రేసింగ్ షో జరుగుతున్న నేపథ్యంలో ఈ దాడి జరిగింది. wsasమధ్యాహ్నం 2:18 గంటల సమయంలో పొడవాటి తుపాకీలతో ఉన్న వ్యక్తులు బూడిద రంగు వ్యాన్ నుంచి దిగి రేసర్లపై కాల్పులు జరపడం ప్రారంభించారని రాయిటర్స్ నివేదించింది.
నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందం
కాల్పులు విషయం తెలిసిన వెంటనే మునిసిపల్, రాష్ట్ర పోలీసులు, మెరైన్స్, ఫైర్ డిపార్ట్‌మెంట్, మెక్సికన్ రెడ్‌క్రాస్, ఇతర ఏజెన్సీలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. కాల్పుల ఘటనపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర అటార్నీ జనరల్ రికార్డో ఇవాన్ కార్పియో సాంచెజ్ ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు మేయర్ అర్మాండో అయాలా రోబుల్స్ తెలిపారు. బాధితుల ఎవరనేది అధికారులు ఇంకా వెల్లడించలేదు. మెక్సికో రెడ్‌క్రాస్ క్షతగాత్రులను ఉత్తర బాజా కాలిఫోర్నియాలోని ఆసుపత్రులకు తరలించిందని వార్తా సంస్థలు నివేదించాయి.