Guyana: గయానా సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 49 మంది గల్లంతు!
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ అమెరికా దేశమైన గయానాలో ఘోర ఫెర్రీ ప్రమాదం చోటుచేసుకుంది. మొత్తం 116 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఓ ఫెర్రీ బోల్తా పడడంతో కలకలం రేగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 67 మందిని సురక్షితంగా రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. మరో 49 మంది ఆచూకీ ఇంకా లభించకపోవడంతో వారి కోసం ముమ్మర గాలింపు కొనసాగుతోంది. గయానా ప్రధాని మార్క్ ఫిలిప్స్ తెలిపిన వివరాల ప్రకారం, ఉత్తర అట్లాంటిక్ తీరం వెంట ఉన్న జార్జ్‌టౌన్ నుంచి కైటుమా వైపు ఫెర్రీ ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలను రంగంలోకి దించి రక్షణ చర్యలు ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు.
వివరాలు
గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయక బృందాలు
ప్రజా పనుల శాఖ మంత్రి జువాన్ ఎడ్జ్‌హిల్ మాట్లాడుతూ, ప్రభుత్వ పడవలతో పాటు ప్రైవేటు బోట్లను కూడా గాలింపు కార్యక్రమంలో వినియోగిస్తున్నట్లు తెలిపారు.
గల్లంతైన వారి కోసం సముద్రంలో విస్తృత స్థాయిలో శోధన కొనసాగుతోందని చెప్పారు.
ప్రమాదానికి గురైన ఫెర్రీలో దాదాపు 250 లైఫ్ జాకెట్లు, రెండు లైఫ్ రాఫ్ట్‌లు అందుబాటులో ఉన్నాయని మంత్రి వెల్లడించారు.
వీటి సహాయంతో మరికొందరు సురక్షితంగా బయటపడే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.
గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయక బృందాలు నిరంతరాయంగా గాలింపు కొనసాగిస్తున్నాయి.