Loading...
Habibi, come to Iran!: 'హబీబీ.. ఇరాన్‌కు రా!'.. అమెరికాను మైన్‌స్వీపర్‌తో ఆటాడుకున్న ఇరాన్
'హబీబీ.. ఇరాన్‌కు రా!'.. అమెరికాను మైన్‌స్వీపర్‌తో ఆటాడుకున్న ఇరాన్

Habibi, come to Iran!: 'హబీబీ.. ఇరాన్‌కు రా!'.. అమెరికాను మైన్‌స్వీపర్‌తో ఆటాడుకున్న ఇరాన్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 04, 2026
08:43 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేస్తున్న వ్యాఖ్యలు, హెచ్చరికలు రోజురోజుకూ మరింత తీవ్రంగా మారుతున్నాయి. ముఖ్యంగా హర్ముజ్‌ జలసంధి విషయంలో ట్రంప్‌ భిన్నమైన ప్రకటనలు చేస్తున్నారు. ఒకసారి హర్ముజ్‌లోని సీమైన్లను తొలగించి.. ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నామని చెబుతున్నారు. మరోసారి ఇరాన్‌ అక్కడ కొత్తగా సీమైన్లు ఏర్పాటు చేస్తోందని, వాటిని అమెరికా సైన్యం అడ్డుకుంటోందని అంటున్నారు. మరో సందర్భంలో ఇరాన్‌లో అమెరికా నిఘా వ్యవస్థ ఎంత పటిష్ఠంగా ఉందో వివరిస్తూ.. అక్కడ ఎవరైనా బాత్రూమ్‌కు వెళ్లినా తమకు తెలిసిపోతుందని వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్‌ వరుస హెచ్చరికలకు ఇరాన్‌ నేరుగా రాజకీయ ప్రకటనతో కాకుండా.. ఓ వీడియో గేమ్‌ ద్వారా వ్యంగ్యంగా సమాధానం ఇచ్చింది.

వివరాలు 

ట్రంప్‌ హెచ్చరికలకు గేమ్‌తో కౌంటర్

హర్ముజ్‌ జలసంధి విషయంలో ట్రంప్‌ చేస్తున్న హెచ్చరికలను ఉద్దేశించి ఇరాన్‌ ఓ వ్యంగ్య వీడియోను రూపొందించింది.

ఆ దేశ ఎంబసీకి చెందిన సోషల్‌ మీడియా ఖాతాలో ఈ వీడియోను పోస్టు చేసింది.

కేవలం 35 సెకన్ల నిడివి ఉన్న ఈ యానిమేషన్‌లో తొలుత హర్ముజ్‌ జలసంధి 3డీ మ్యాప్‌ కనిపిస్తుంది.

ఆ తర్వాత దృశ్యం మైన్‌స్వీపర్‌ గేమ్‌ను తలపించేలా మారుతుంది. పాత కంప్యూటర్లలో బాంబులు ఎక్కడ దాగి ఉన్నాయో గుర్తించే ఈ గేమ్‌ అందరికీ తెలిసిందే.

అదే కాన్సెప్ట్‌ను హర్ముజ్‌ జలసంధిలోని సీమైన్లకు అన్వయిస్తూ ఇరాన్‌ ఈ వీడియోను రూపొందించింది.

'హబీబీ (అంకుల్‌ సామ్‌).. ఇరాన్‌కు రా!' అనే సందేశాన్ని కూడా అందులో ఉంచింది.

వివరాలు 

అసలు సీమైన్ల వివాదం ఏంటి?

అంటే మైన్‌స్వీపర్‌ గేమ్‌లో బాంబుల కోసం వెతికినట్టుగా..అమెరికా కూడా హర్ముజ్‌లో సీమైన్ల కోసం వెతుకుతోందని ఎద్దేవా చేయడం ఈ వీడియో ఉద్దేశమన్నమాట.

పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హర్ముజ్‌ జలసంధిలో సీమైన్లు ఏర్పాటు చేసి నౌకల రాకపోకలకు ఇరాన్‌ ఆటంకాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది.

ఈనేపథ్యంలో దాదాపు ఐదునెలల పాటు కొనసాగిన పరిస్థితుల తర్వాత ఓ రహస్య ఆపరేషన్‌ చేపట్టి సీమైన్లను సమర్థంగా తొలగించామని ట్రంప్‌ ప్రకటించారు.

దీన్ని అమెరికా సైన్యం సాధించిన అజేయ విజయంగా అభివర్ణించారు.

అయితే ఆ ప్రకటన చేసిన రెండ్రోజులకే ట్రంప్‌ మళ్లీ ఇరాన్‌పై ఆరోపణలు చేశారు.హర్ముజ్‌లో ఇరాన్‌ కొత్త సీమైన్లను ఏర్పాటు చేస్తోందని అన్నారు.

అంతర్జాతీయ నౌకామార్గాల్లో ఉన్న వాటిని తొలగించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హర్ముజ్‌లో సీమైన్ల వేట.. అమెరికాను గేమ్‌తో హేళన చేసిన ఇరాన్

ADVERTISEMENT

వివరాలు 

లారక్‌ దీవిలో రాకెట్‌ లాంచర్లు ధ్వంసం

ఈ పరిణామాల మధ్య హర్ముజ్‌ జలసంధిలోని ఇరాన్‌కు చెందిన లారక్‌ దీవిపై అమెరికా రెండు రాకెట్‌ లాంచర్లను ధ్వంసం చేసింది.

ఈ లాంచర్ల ద్వారా ఇరాన్‌ సీమైన్లను హర్ముజ్‌ జలసంధిలోకి తరలించేందుకు సిద్ధమవుతోందని అమెరికా ఆరోపించింది.

దీనికి ప్రతిస్పందనగా జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు చేసింది.

దీంతో దాదాపు నెల రోజుల తర్వాత పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి.

ఈ ఘర్షణల కారణంగా అమాయకులు కూడా ప్రాణాలు కోల్పోయారు.

వివరాలు 

అమెరికా ఆరోపణలను ఇరాన్‌ ఖండిస్తోంది

అయితే హర్ముజ్‌ సీమైన్లకు సంబంధించి అమెరికా చేస్తున్న ఆరోపణలను ఇరాన్‌ మొదటి నుంచీ తిరస్కరిస్తోంది.

సీమైన్ల విషయంలో అమెరికా చెబుతున్న విషయాల్లో నిజం లేదని ఆ దేశం అంటోంది.

మార్కెట్లలో నెలకొన్న ఆందోళనను తగ్గించేందుకు, పరిస్థితులను అదుపులో ఉన్నట్లు చూపించేందుకు అమెరికా ఈ ప్రకటనలు చేస్తోందని ఇరాన్‌ ఆరోపిస్తోంది.

అదే సమయంలో హర్ముజ్‌ జలసంధిపై పూర్తి నియంత్రణ తమకే ఉందని ఇరాన్‌ స్పష్టం చేస్తోంది.

దీంతో అమెరికా, ఇరాన్‌ మధ్య అసలు ఎవరి నిఘా వ్యవస్థ బలంగా ఉంది? హర్ముజ్‌పై ఎవరి పట్టు ఉంది? అనే అంశాలు ఇప్పుడు కీలకంగా మారాయి.

వివరాలు 

ట్రంప్‌ మాటలకు ఇరాన్‌ వ్యూహాలతో సమాధానం

తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా ఇరాన్‌పై సైనిక దాడులను కొనసాగిస్తోంది.

మరోవైపు ఇరాన్‌ కూడా అమెరికా స్థావరాలతో పాటు ప్రాంతీయ మిత్రదేశాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తోంది.

దీంతో హర్ముజ్‌ జలసంధి చుట్టూ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి.

ఇదే సమయంలో ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోంది.

చమురు ఎగుమతులకు అడ్డంకులు సృష్టించడం, ఆంక్షలను మరింత కఠినతరం చేయడం ద్వారా ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తోంది.

అయితే హర్ముజ్‌ విషయంలో అమెరికా సైనిక సామర్థ్యం ఒకవైపు.. ఇరాన్‌ అనుసరిస్తున్న వ్యూహాత్మక ప్రతిస్పందన మరోవైపు నిలిచాయి.

ఈ రెండు దేశాల మధ్య కొనసాగుతున్న పోరు ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది.

ADVERTISEMENT