
Tea App Data Breach: డేటా లీక్ తుపాన్‌లో 'టీ' డేటింగ్ యాప్..11 లక్షల మంది మహిళల ప్రైవేట్ చాట్ లీక్..!
ఈ వార్తాకథనం ఏంటి
మహిళలు తమకు నచ్చిన విషయాలను పంచుకోవడానికి ప్రత్యేకంగా రూపొందించిన డేటింగ్ ప్లాట్‌ఫామ్ 'టీ' (Tea App) ప్రస్తుతం గోప్యతా ఉల్లంఘనల సమస్యతో తీవ్రమైన సంక్షోభంలో పడింది. ఈ యాప్‌లో నమోదైన 11 లక్షల మంది యూజర్ల మధ్య జరిగిన ప్రైవేట్ సందేశాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయని ఓ ప్రముఖ మీడియా నివేదిక వెల్లడించింది. ఈ మెసేజ్‌లలో అత్యంత వ్యక్తిగతమైన, సున్నితమైన సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. 'టీ' యాప్‌ను మహిళలకు భద్రత కల్పించే వేదికగా ప్రవేశపెట్టామని నిర్వాహకులు చెప్తున్నప్పటికీ.. వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా కనిపిస్తోంది. ఇటీవలే వేలాది మంది యూజర్ల సెల్ఫీలు,ఐడెంటిటీ ఫోటోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొట్టాయి.
వివరాలు
తాజా లీక్‌లో 2023 సంవత్సరం నుంచి జరిగిన సంభాషణలు
ఈ విషయాన్ని ఓ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు మీడియాతో వెల్లడించారు. తాజా లీక్‌లో 2023 సంవత్సరం నుంచి జరిగిన సంభాషణలు కూడా ఉన్నాయి. ఇందులో కొన్ని మహిళలు గర్భసంకోచం (అబార్షన్), సంబంధాల సమస్యలపై చర్చించినట్లు సమాచారం. ఈ యాప్‌లో నకిలీ పేర్లతో అకౌంట్లు సృష్టించే సౌలభ్యం ఉన్నప్పటికీ.. చాలా మంది యూజర్లు తమ అసలైన వివరాలను ఉపయోగించినట్లు తెలిసింది. తమ చాటింగ్ సంపూర్ణంగా ప్రైవేట్ అని భావించిన వారు ఇప్పుడు తమ వ్యక్తిగత సమాచారం బహిరంగమవడంపై తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. దీనితో ఈ యాప్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వివరాలు
యాప్ భద్రతా ప్రమాణాలపై తీవ్ర అనుమానాలు
ప్రస్తుతం 'టీ' డేటింగ్ యాప్‌లో దాదాపు 16 లక్షల మంది యూజర్లు ఉన్నారు. మహిళలు మాత్రమే ఈ యాప్‌లో సభ్యత్వం పొందే అవకాశం ఉండేలా, వారి సెల్ఫీల ఆధారంగా గుర్తింపు ప్రక్రియను రూపొందించారు. ఈ ప్రత్యేకత వల్లే చాలా మంది మహిళలు ఈ యాప్‌ను నమ్మారు. అయితే వరుసగా జరుగుతున్న డేటా ఉల్లంఘనల నేపథ్యంలో యాప్ భద్రతా ప్రమాణాలపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో 'టీ' యాప్ నిర్వాహకులు స్పందించారు. ''ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు ఇప్పటికే ప్రారంభించాం. సైబర్ సెక్యూరిటీ నిపుణులతో లోతుగా విచారణ జరిపిస్తున్నాం. అంతేకాకుండా, భద్రతా సంస్థలు జరిపే దర్యాప్తుకు కూడా సంపూర్ణ సహకారం అందిస్తున్నాం'' అని వారు స్పష్టం చేశారు.