Loading...
Pakistan: కశ్మీర్‌లోకి 10 వేల మంది ఉగ్రవాదులు.. లష్కరే చీఫ్‌పై పాక్ మతబోధకుడి సంచలన వ్యాఖ్యలు
లష్కరే చీఫ్‌పై పాక్ మతబోధకుడి సంచలన వ్యాఖ్యలు

Pakistan: కశ్మీర్‌లోకి 10 వేల మంది ఉగ్రవాదులు.. లష్కరే చీఫ్‌పై పాక్ మతబోధకుడి సంచలన వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 19, 2026
08:56 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌ నుంచి జమ్ముకశ్మీర్‌లోకి 10 వేల మంది ఉగ్రవాదులు చొరబడ్డారంటూ పాక్‌కు చెందిన ఓ మతబోధకుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. లష్కరే తయ్యిబా అధినేత హఫీజ్‌ సయీద్‌ (Hafiz Saeed) వారిని కశ్మీర్‌కు పంపించాడని అతడు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 14న నాసిర్‌ మద్నీ చేసిన ప్రసంగంలోని వ్యాఖ్యలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. బహావల్‌ నగర్‌లో లష్కరే అనుబంధ కార్యక్రమంలో మాట్లాడిన మద్నీ.. హఫీజ్‌ సయీద్‌ను మాతృభూమి కోసం పనిచేసే వ్యక్తిగా అభివర్ణించాడు. ఈ వ్యాఖ్యలు కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు హఫీజ్‌ సయీద్‌ సంబంధాలపై మరోసారి చర్చకు దారితీశాయి.

వివరాలు 

లష్కరే తయ్యిబాను నిషేధిత ఉగ్రసంస్థగా ప్రకటించిన ఐరాస 

అల్‌ఖైదా, తాలిబన్లతో సంబంధాలు ఉన్నాయనే కారణాలతో ఐక్యరాజ్యసమితి 2005లో లష్కరే తయ్యిబాను నిషేధిత ఉగ్రసంస్థగా ప్రకటించింది.

ఆ సంస్థ అధినేత హఫీజ్‌ సయీద్‌ను కూడా అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది.

భారత్‌లో చోటుచేసుకున్న పలు ఉగ్రదాడుల దర్యాప్తులో అతడి పేరు పలుమార్లు ప్రస్తావనకు వచ్చింది.

ముఖ్యంగా 26/11 ముంబయి ఉగ్రదాడుల కేసులోనూ హఫీజ్‌ సయీద్‌ పేరు వెలుగులోకి వచ్చింది.

వివరాలు 

పహల్గాం ఉగ్రదాడిలో హఫీజ్‌ సయీద్‌ పాత్ర

ఇటీవల జరిగిన పహల్గాం ఉగ్రదాడి కేసులోనూ అతడిపై జమ్ములోని న్యాయస్థానం నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది.

ఈ దాడికి ఉగ్రవాదులను ఆదేశించడం, దాడి కుట్రకు ప్రణాళిక రూపొందించడం, దాన్ని అమలు చేసే ప్రక్రియను ఎప్పటికప్పుడు సమీక్షించడం వంటి చర్యల్లో హఫీజ్‌ సయీద్‌ పాత్ర ఉందని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఆరోపించింది.

ఈ మేరకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని దర్యాప్తు సంస్థ పేర్కొన్న సంగతి తెలిసిందే.

ADVERTISEMENT