
Donald Trump: ఉక్రెయిన్ గ్యాస్ పైపులైన్‌ను మాకు అప్పగించండి.. అమెరికా డిమాండ్
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్ భూభాగం మీదుగా వెళ్లే రష్యా గ్యాస్ పైపులైన్‌ను తమ అధీనంలోకి ఇవ్వాలంటూ అమెరికా డిమాండ్ చేసిందని సమాచారం.
ఇప్పటికే ఉక్రెయిన్-అమెరికా మధ్య ఖనిజాల ఒప్పందాలపై స్పష్టత రాకపోవడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇరు దేశాల అధికారుల మధ్య ఇటీవల ఓ కీలక సమావేశం జరిగింది. ట్రంప్ ప్రభుత్వం తాము ఇచ్చిన ఆర్థిక సహాయానికి ప్రతిఫలంగా కీలక వనరులు డిమాండ్ చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ చర్చల సందర్భంగా, అమెరికాకు చెందిన 'ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్'కు సోవియట్ యుగానికి చెందిన ఓ ప్రాచీన గ్యాస్ పైపులైన్‌ను అప్పగించాలన్న డిమాండ్ వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.
Details
గ్యాస్ ట్రాన్సిట్ ఫీజు చెల్లింపుల నిలిపివేత
ఈ పైపులైన్ పశ్చిమ రష్యాలోని సుడ్‌ఝా నుంచి ప్రారంభమై, ఉక్రెయిన్ మీదుగా స్లోవాకియా సరిహద్దులకు చేరుతుంది.
దీనివల్ల ఐరోపా దేశాలకు గ్యాస్ సరఫరా జరుగుతోంది. గతంలో రష్యా గ్యాజ్‌ప్రోమ్‌తో ఉక్రెయిన్ కలిగి ఉన్న ఐదేళ్ల ఒప్పందం ముగియడంతో, జనవరి 1 నుంచి ఈ పైపులైన్ వినియోగం నిలిచిపోయింది.
అంతేకాదు గ్యాస్ ట్రాన్సిట్ ఫీజు చెల్లింపులు కూడా నిలిపివేశారు.
ఇదే సమయంలో, ఖనిజ వనరులు, చమురు విషయంలో అమెరికా ఒత్తిడిని పెంచుతోందని విశ్లేషకుల అభిప్రాయం.
ఉక్రెయిన్‌కు గతంలో అందించిన ఆర్థిక మద్దతుకు బదులుగా, అమెరికా ఈ గ్యాస్ పైపులైన్ వంటి కీలక వనరులను కోరుతుండటం చర్చనీయాంశంగా మారింది.