Hanoi Cafe Fire: కేఫ్‌లో గొడవ..పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుడు.. 11 మంది సజీవదహనం
వియత్నాం రాజధాని హనోయిలో బుధవారం జరిగిన ఓ అగ్నిప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనను వియత్నాం పబ్లిక్ సెక్యూరిటీ మంత్రిత్వ శాఖ గురువారం ధృవీకరించింది. ఈ ప్రమాదం మూడు అంతస్తుల ఉన్న కేఫ్ లో చోటు చేసుకుంది. కేఫ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉద్యోగులతో గొడవ చేసి, పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యక్తిగత కక్షతోనే ఈ అగ్నిప్రమాదం చేసినట్లు నిందితుడు అంగీకరించాడని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదం జరిగిన తర్వాత, ఆ ప్రాంతంలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మంత్రిత్వ శాఖ ప్రకారం, రెస్క్యూ బృందాలు మంటల మధ్య నుంచి ఏడుగురిని రక్షించాయి, వీరిలో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రమాదం సమయంలో పెద్ద పేలుడు శబ్దాలు
ఇది హనోయ్‌లో జరిగిన అగ్నిప్రమాదం మొదటి సారి కాదని చెప్పవచ్చు. కొద్ది నెలల క్రితం, ఒక అపార్ట్‌మెంట్ భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనల అనంతరం, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. స్థానికుల కథనాల ప్రకారం, ప్రమాదం సమయంలో పెద్ద పేలుడు శబ్దాలు వినిపించాయి. వారు వెంటనే బయటకి పరుగెత్తగానే, మంటలు విస్తరిస్తున్నట్టు కనిపించాయి. ఈ సంఘటన హనోయిలో అగ్నిప్రమాదాల పెరుగుదలపై ప్రశ్నలు రేపుతోంది, అలాగే భవిష్యత్తులో మరింత మెరుగైన భద్రతా చర్యలు అవసరమైందని స్పష్టం చేస్తోంది.