LOADING...
Hantavirus: కలవరపెడుతున్న హంటా వైరస్‌.. నిధుల కొరతతో ఆగిన టీకా పరిశోధనలు
కలవరపెడుతున్న హంటా వైరస్‌.. నిధుల కొరతతో ఆగిన టీకా పరిశోధనలు

Hantavirus: కలవరపెడుతున్న హంటా వైరస్‌.. నిధుల కొరతతో ఆగిన టీకా పరిశోధనలు

వ్రాసిన వారు Sirish Praharaju
May 14, 2026
05:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

హంటా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా మరోసారి ఆందోళనలు రేకెత్తిస్తోంది. ఇటీవల క్రూజ్‌ నౌక ఎంవీ హొండియస్‌లో ప్రయాణించిన పలువురు ఈ వైరస్‌ బారిన పడటంతో పరిస్థితి కలవరపరిచింది. శ్వాసకోశ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపే ఈ వైరస్‌ కారణంగా మరణాల శాతం ఎక్కువగా ఉండటం భయాన్ని పెంచుతోంది. ఇప్పటివరకు దీనికి సమర్థమైన టీకా అందుబాటులో లేకపోవడంతో వ్యాప్తిని అడ్డుకునే మార్గాలపై శాస్త్రవేత్తలు మళ్లీ దృష్టి సారించారు. అయితే, ఈ వైరస్‌కు దాదాపు పదేళ్ల కిందటే టీకా రావాల్సి ఉండగా నిధుల కొరత కారణంగా పరిశోధనలు నిలిచిపోయినట్లు వెల్లడైంది.

వివరాలు 

2016లో కీలక పురోగతి సాధించిన శాస్త్రవేత్తలు

చిలీలోని ఓ విశ్వవిద్యాలయంలో వైరాలజీ శాస్త్రవేత్త మరియా జోస్‌ బరియా ఆధ్వర్యంలోని బృందం హంటా వైరస్‌పై విస్తృతంగా అధ్యయనాలు చేపట్టింది. ముఖ్యంగా మనుషుల నుంచి మనుషులకు వ్యాపించే ఆండిస్‌ రకం హంటా వైరస్‌ను అడ్డుకునే ప్రతిరక్షక కణాల సామర్థ్యంపై పరిశోధనలు సాగించాయి. ఈ క్రమంలో 2016లో కీలక పురోగతి సాధించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. జంతువులపై నిర్వహించిన పరీక్షల్లో ఆశాజనక ఫలితాలు వచ్చినప్పటికీ, ఆ తరువాత మనుషులపై పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన నిధులు అందక ప్రాజెక్టు ముందుకు సాగలేదని మరియా జోస్‌ తెలిపారు.

వివరాలు 

పరిశోధనలకు ఏడాది నుంచి రెండేళ్ల సమయం పట్టే అవకాశం

మనుషులపై పరీక్షలు చేపట్టేందుకు సుమారు ఏడు మిలియన్‌ డాలర్ల వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు చెప్పారు. నిధుల కోసం అనేక అంతర్జాతీయ సంస్థలను సంప్రదించినప్పటికీ ఆశించిన సహాయం లభించలేదన్నారు. ఇదే సమయంలో కరోనా మహమ్మారి రావడంతో పరిశోధనలు పూర్తిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. ప్రస్తుతం వెంటనే నిధులు లభించినా కూడా పూర్తి స్థాయి పరీక్షలు ముగియడానికి కనీసం ఏడాది నుంచి రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు.

Advertisement

వివరాలు 

హంటా వైరస్‌లో సుమారు 40 రకాలు

శాస్త్రవేత్తల వివరాల ప్రకారం హంటా వైరస్‌లో సుమారు 40 రకాలున్నాయి. వీటిని ఓల్డ్‌ వరల్డ్‌, న్యూ వరల్డ్‌ అనే రెండు వర్గాలుగా విభజించారు. న్యూ వరల్డ్‌ రకాలు ప్రధానంగా ఉత్తర, దక్షిణ అమెరికా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. చిలీలో ప్రతి సంవత్సరం 40 నుంచి 60 వరకు కేసులు నమోదవుతున్నాయి. వీటిలో మరణాల శాతం దాదాపు 40గా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు అక్కడ 39 కేసులు నమోదు కాగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ అర్జెంటీనాలో కూడా 42 కేసులు బయటపడ్డాయి. ఈ వైరస్‌ సోకినవారిలో ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

వివరాలు 

ఆండిస్‌ రకానికి చెందిన వైరస్

ఇటీవల అర్జెంటీనా నుంచి బయల్దేరిన హొండియస్‌ నౌకలో పలువురు హంటా వైరస్‌ బారిన పడిన విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వీరిలో ముగ్గురు మరణించారు. ఈ ఘటనలో బయటపడిన వైరస్‌ అత్యంత ప్రమాదకరమైన ఆండిస్‌ రకానికి చెందినదిగా అధికారులు నిర్ధరించారు. బాధితులతో అత్యంత సన్నిహితంగా ఉండే సమయంలో ఈ వైరస్‌ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

Advertisement