Hardeep Singh Nijjar: నిజ్జర్ హత్య కేసు దర్యాప్తును అడ్డుకున్నది కెనడా అధికారులే: భారత హైకమిషనర్ సంచలన కామెంట్స్
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత గత కొన్ని నెలలుగా భారత్, కెనడా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇదిలావుండగా, తాజాగా హత్య కేసు దర్యాప్తుకు సంబంధించి, కెనడాలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ కీలక సంచలన కామెంట్స్ చేశారు. దర్యాప్తు ఇప్పటికే విఫలమైందన్నారు. ఈ కేసులో కెనడాకు చెందిన ఓ ఉన్నత స్థాయి అధికారి ఇచ్చిన ఆదేశాలు దర్యాప్తును దెబ్బతీశాయన్నారు. సెప్టెంబర్ 13న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను భారత్ ఖండించింది. ఇదే విషయంపై కెనడాలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ గ్లోబ్ అండ్ మెయిల్‌తో మాట్లాడారు.
కెనడా ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు: సంజయ్ కుమార్ వర్మ
జూన్‌లో బ్రిటిష్ కొలంబియాలో హర్‌దీప్ సింగ్ హత్యపై కెనడా పోలీసుల దర్యాప్తు చేస్తున్న క్రమంలో కెనడాకు చెందిన ఉన్నత స్థాయి అధికారి వారికి కీలక ఆదేశాలు ఇచ్చారని సంజయ్ వర్మ చెప్పారు. నిజ్జర్ హత్య వెనుక భారతీయ ఏజెంట్లు ఉన్నారని చెప్పాలని పోలీసులకు ఆ ఉన్నతాధికారి ఆదేశాలు ఇచ్చారని వర్మ వెల్లడించారు. అయితే ఆ ఉన్నతాధికారి పేరును సంజయ్ కుమార్ వర్మ వెల్లడించలేదు. నిజ్జర్ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉన్నట్లు కెనడా లేదా కెనడా మిత్రదేశాలు భారత్‌కు కచ్చితమైన ఆధారాలు చూపలేదని ఆయన అన్నారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య కేసులో కెనడా నుంచి భారత్ సాక్ష్యాలను కోరింది, అయితే కెనడా ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలను సమర్పించలేకపోయింది.