అమెరికాలో భారీ వర్షాలు.. 2600 విమానాలు రద్దు
అమెరికాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా దేశవ్యాప్తంగా 2600 పైగా విమానాల రాకపోకలను రద్దు చేశారు. మరో 8వేల విమనాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఆమెరికాలోని నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఫ్లైట్ సర్వీస్‌లకు అంతరాయం కలిగినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 2,600 విమానాలు రద్దయితే, అందులో నార్త్ ఈస్ట్ రీజియన్‌కు చెందిన విమానాలే 1,320 ఉన్నాయి. న్యూజెర్సీ రాష్ట్రంలోని నెవార్క్ లిబర్టీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోనే 350 విమానాలు నిలిచిపోవడం గమనార్హం.
వరద నీటిలో చిక్కుకున్న న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ ప్రాంతాలు
జేఎఫ్‌కే విమానాశ్రయంలో 318 రద్దు కాగా 426 సర్వీసులు ఆలస్యంగా నడస్తున్నాయి. ఇక లా గార్డియన్‌లో 270 సర్వీసులు రద్దుకాగా.. 292 ఆలస్యంగా ప్రయాణించనున్నాయి. విమానాలు ఎగరడానికి అనుకూల వాతావరణం లేకపోవడం వల్లే ఎయిర్ పోర్ట్‌లోనే నిలిచిపోయాయి. అమెరికాలోని నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తుతున్నాయి. న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, పెన్సిల్వేనియా, వెర్మాంట్ వంటి ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. భారీ వరదలు వచ్చే అకాశముందని అధికారులు హెచ్చరించారు. మరోవైపు అమెరికాలోని దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో మాత్రం ఎండలు మండుతున్నాయి. కాలిఫోర్నియాలోని డెత్‌వ్యాలీలో ఏకంగా 52 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం.