LOADING...
Heavy Rains China: చైనాలో భారీ వర్షాల బీభత్సం.. 37 వేల మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలింపు

Heavy Rains China: చైనాలో భారీ వర్షాల బీభత్సం.. 37 వేల మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలింపు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 18, 2026
03:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనాలోని దక్షిణ ప్రాంతమైన గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌ను గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరదల ముప్పు పెరగడంతో ప్రమాదకర ప్రాంతాల్లో నివసిస్తున్న 37,600మందికి పైగా ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రావిన్స్‌లో లెవల్-3వరద నియంత్రణ అత్యవసర పరిస్థితితో పాటు లెవల్-4విపత్తు సహాయక చర్యలను అమల్లోకి తీసుకొచ్చారు. భారీ వర్షాల ప్రభావంతో గ్వాంగ్‌డాంగ్‌లోని జుహాయ్,షెన్‌జెన్ సహా పలు నగరాల్లో పాఠశాలలకు తాత్కాలికంగా సెలవులు ప్రకటించారు. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ కూడా కొన్ని రైళ్ల సమయాల్లో మార్పులు చేసి, అవసరమైన చోట సేవలను సవరించింది.Embed

వివరాలు 

కీలక నగరాల్లో 247 మంది అగ్నిమాపక సిబ్బంది, 53 ఫైర్ ఇంజిన్లు,37పడవలు సిద్ధం 

స్థానిక మీడియా కథనాల ప్రకారం,గత శుక్రవారం నుంచే గ్వాంగ్‌డాంగ్ ఫైర్ అండ్ రెస్క్యూ విభాగం అప్రమత్తమైంది. కీలక నగరాల్లో 247 మంది అగ్నిమాపక సిబ్బంది, 53 ఫైర్ ఇంజిన్లు,37పడవలను సిద్ధంగా ఉంచింది. మరోవైపు,ఆనకట్టలు,చెరువులు,నదీ తీర ప్రాంతాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు 41,768మంది సిబ్బందిని నీటి వనరుల శాఖ రంగంలోకి దించింది. విపత్తు సహాయక చర్యల్లో భాగంగా 7,226మంది అత్యవసర మరమ్మత్తు సిబ్బంది, 2,994వాహనాలు, 2,108జనరేటర్లను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం వరదల ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ,ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని ప్రావిన్స్ అత్యవసర నిర్వహణ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉండగా,గ్వాంగ్‌డాంగ్ దక్షిణ ప్రాంతాల్లో బుధవారం నుంచి గురువారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.

వివరాలు 

శుక్రవారం నుంచి వర్షాల తీవ్రత కొంత తగ్గే అవకాశం

కొన్ని ప్రాంతాల్లో అత్యంత తీవ్ర వర్షాలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. అయితే శుక్రవారం నుంచి వర్షాల తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక వాతావరణ మార్పుల ప్రభావం చైనాపై తీవ్రంగా పడుతోందని జీ20 క్లైమేట్ రిస్క్ అట్లాస్ నివేదిక పేర్కొంది. కార్బన్ ఉద్గారాలను నియంత్రించడంలో విఫలమైతే చైనాలో భవిష్యత్తులో తీవ్ర ఉష్ణోగ్రతలు, వరదలు మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 2050 నాటికి 2.5 కోట్ల మందికి పైగా నదీ వరదల ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉందని, 2100 నాటికి వరదల కారణంగా చైనా ఆర్థిక వ్యవస్థకు వందల బిలియన్ యూరోల నష్టం వాటిల్లే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చైనాలో ప్రకృతి విపత్తు.. భారీ వర్షాలతో అప్రమత్తమైన ప్రభుత్వం

Advertisement