Lebanon-Israel War: లెబనాన్‌లో హిజ్బుల్లా కమాండర్ హతం
ఇజ్రాయెల్ సైన్యం హిజ్బుల్లా,హమాస్ సంస్థలను లక్ష్యంగా చేసుకుని యుద్ధం కొనసాగిస్తోంది. ఈ రెండు గ్రూపులకు చెందిన అగ్ర నాయకులను ఐడీఎఫ్ ఇప్పటికే హతమార్చింది. వాటి మూలాలను సైతం నిర్మూలించాలనే ఉద్దేశంతో ఇజ్రాయెల్ దళాలు ముందుకు సాగుతున్నాయి. తాజాగా, ఐడీఎఫ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయిన ట్విట్టర్‌లో కీలకమైన సమాచారాన్ని విడుదల చేసింది. దక్షిణ లెబనాన్‌లోని బరాచిత్ ప్రాంతంలో హిజ్బుల్లా కమాండర్ అబూ అలీ రిదాను చంపినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది, అతడు వైమానిక దాడిలో చనిపోయినట్లు తెలిపింది. రిదా, ఇజ్రాయెల్ సైన్యంపై రాకెట్, యాంటీ ట్యాంక్ క్షిపణి దాడులకు కుట్ర పన్నినట్లు ఐడీఎఫ్ పేర్కొంది. అలాగే, హిజ్బుల్లా కార్యకర్తల ఉగ్రవాద కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించింది.
అహ్మద్ అల్-దాలు హతం
అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడి చేయడానికి కుట్ర పన్నిన ఇస్లామిక్ జిహాద్ మిలిటరీ ఇంటెలిజెన్స్ యూనిట్ సభ్యుడు అహ్మద్ అల్-దాలును గాజాలో హతమార్చినట్లు ఐడీఎఫ్ తెలిపింది. అక్టోబర్ 7న క్ఫర్ అజాలో జరిగిన దాడిలో ఇతడు పాల్గొన్నట్లు స్పష్టం చేసింది. అహ్మద్ అల్-దాలును చంపడంతో పాటు, మరో ఉగ్రవాదిని కూడా చంపినట్లు ఇజ్రాయెల్ దళాలు వెల్లడించాయి. ఇతను ఇజ్రాయెల్ పౌరులపై ఉగ్రదాడులకు పథకాలు రూపొందించి అమలు చేశాడని పేర్కొంది.
హమాస్ చేసిన దుర్మార్గ చర్యలకు ఇజ్రాయెల్ ప్రతీకారం
2023 అక్టోబర్ 7న పశ్చిమ ఆసియాలో ప్రారంభమైన యుద్ధం ఇంకా కొనసాగుతోంది. హమాస్ చేసిన దుర్మార్గ చర్యలకు ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంటోంది. ఇప్పటికే, హమాస్ అగ్ర నాయకులను హతమార్చడంతో పాటు, హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను కూడా ఐడీఎఫ్ నిర్మూలించింది. తాజాగా, హిజ్బుల్లా అధినేతగా నయీం ఖాసింకు ఎన్నికైన తర్వాత, అతడిని కూడా చంపేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది.