
Hassan Nasrallah: హెజ్‌బొల్లా నేత హసన్ నస్రల్లా ఇక లేరు.. ధ్రువీకరించిన ఇజ్రాయెల్
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్ శుక్రవారం భారీ దాడులతో హెజ్‌బొల్లాపై భీకర స్థాయిలో విరుచుకుపడింది.
ఈ దాడులు ప్రధానంగా దక్షిణ లెబనాన్‌లోని దాహియా ప్రాంతంలో చోటుచేసుకున్నాయి.
నివాసగృహాల కింద ఉన్న భూగర్భంలో స్థాపించిన హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ అత్యంత శక్తివంతమైన బాంబులను ప్రయోగించింది.
ఈ దాడుల్లో హెజ్‌బొల్లా నేత హసన్ నస్రల్లా మరణించినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం అధికారికంగా ధ్రువీకరించింది. ఈ విషయాన్ని ఐడీఎఫ్ తన 'ఎక్స్' (మాజీ ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసి వెల్లడించింది.
Details
ఆరుగురు మృతి చెందినట్లు లైబనాన్ ఆరోగ్య శాఖ ప్రకటన
ఈ దాడుల్లో ఆరుగురు వ్యక్తులు మృతిచెందినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణం గురించి ఇప్పటికీ ఏమైనా అధికారిక స్పందన రాలేదు.
నిన్న రాత్రి నుండి అతడు కాంటాక్ట్‌లో లేనట్లు హెజ్‌బొల్లా వర్గాలు తెలిపారు. నస్రల్లా కుమార్తె జైనబ్ నస్రల్లా కూడా మరణించినట్లు ఇజ్రాయెల్ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
శనివారం ఉదయం, లెబనాన్‌లోని బెకా వ్యాలీలో ఐడీఎఫ్ మరో వైమానిక దాడులు జరిపింది.
ఇందులో హెజ్‌బొల్లా క్షిపణి యూనిట్ కమాండర్ మహమ్మద్ అలీ ఇస్మాయిల్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది.
బీరుట్‌లో జరిగిన దాడుల నేపథ్యంలో హెజ్‌బొల్లా ప్రతీకార చర్యలకు సిద్ధమైంది. ఇజ్రాయెల్ భూభాగాలను లక్ష్యంగా చేసుకుని రాకెట్లతో విరుచుకుపడింది.