Hassan Nasrallah: నస్రల్లా సహా హిజ్బుల్లా టాప్ కమాండర్లు మృతి.. హిజ్బుల్లా తరువాతి చీఫ్ ఇతడేనా?
ఇజ్రాయెల్, హిజ్బుల్లాపై విరుచుకుపడుతూ, శుక్రవారం లెబనాన్‌లోని బీరూట్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో హిజ్బుల్లా స్థావరాలపై విరుచుకుపడింది. ఈ దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణించాడని ఇజ్రాయెల్ ఆర్మీ ధ్రువీకరించింది. గత 32 ఏళ్లుగా హిజ్బుల్లా నాయకత్వంలో ఉన్న 64 ఏళ్ల నస్రల్లా, అత్యంత సురక్షిత ప్రాంతంలో ఉన్నా ఇజ్రాయిల్ భీకర దాడి చేయడంతో ఆయన మృతి చెందాడు. ఈ దాడిలో నస్రల్లాతో పాటు అతని కుమార్తె జైనాబ్ కూడా చనిపోయినట్లు అధికారిక సమాచారం.
నస్రల్లా వారసుడు సఫీద్దీన్..?
ఇజ్రాయిల్ దాడుల్లో హిజ్బుల్లా కీలక కమాండర్లు కూడా మృతి చెందారు. ఫువాద్ షుక్ర్, ఇబ్రహీం అకిల్, అలీ కరాకీ వంటి ముఖ్య నాయకులు దాడుల్లో హతమయ్యారు. ప్రస్తుతం హిజ్బుల్లా టాప్ కమాండర్లలో కేవలం ఒకరైన అబూ అలీ రిదా మాత్రమే బతికి ఉన్నట్లు తెలుస్తోంది. హిజ్బుల్లా కొత్త నాయకుడు ఎవరు అనే ప్రశ్న సర్వత్రా చర్చకు దారితీస్తోంది. నస్రల్లా వారసుడిగా హషేమ్ సఫీద్దీన్ నియామకం కానున్నట్లు తెలుస్తోంది. అతను హిజ్బుల్లా రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షించే ''జిహద్ కౌన్సిల్''లో సభ్యుడిగా ఉన్నాడు.