Sushen Chandra Sarkar: బంగ్లాదేశ్‌లో ఎన్నికలకు 3 రోజుల ముందు.. హిందూ వ్యాపారవేత్త దారుణ హత్య
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే అక్కడ పలువురు హిందువులు దారుణ హత్యలకు గురైన విషయం తెలిసిందే. ఈ నెల 12న బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, మరోసారి హిందూ వర్గానికి చెందిన వ్యక్తిని హత్య చేయడం కలకలం రేపింది. మైమెన్‌సింగ్ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. త్రిషల్ సబ్‌డిస్ట్రిక్ట్‌లోని బోగర్ బజార్‌లో బియ్యం వ్యాపారం చేస్తున్న సుషేన్ చంద్ర సర్కార్ (62) అనే వ్యాపారిని ఆయన దుకాణంలోనే గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు.
వివరాలు
పదునైన ఆయుధాలతో ఆయనపై దాడి చేశారన్న పోలీసులు
ఆయన ఇదే ప్రాంతంలోని సౌత్ కాండ గ్రామానికి చెందినవారిగా పోలీసులు తెలిపారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ హత్య జరిగినట్లు వెల్లడించారు. పదునైన ఆయుధాలతో దుండగులు సుషేన్‌పై దాడి చేసి హతమార్చినట్టు సమాచారం. ఆ సమయంలో ఆయన ఒంటరిగా దుకాణంలోనే ఉన్నారని చెప్పారు. హత్య అనంతరం నిందితులు దుకాణం షట్టర్ దించి, మృతదేహాన్ని అక్కడే వదిలి పరారైనట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టామని, నిందితులను గుర్తించి పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.