LOADING...
Australia:మెల్‌బోర్న్‌లో జాత్యహంకారులవెర్రి చేష్టలు.. హిందూ దేవాలయంపై పిచ్చి రాతలు  
మెల్‌బోర్న్‌లో జాత్యహంకారులవెర్రి చేష్టలు.. హిందూ దేవాలయంపై పిచ్చి రాతలు

Australia:మెల్‌బోర్న్‌లో జాత్యహంకారులవెర్రి చేష్టలు.. హిందూ దేవాలయంపై పిచ్చి రాతలు  

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 24, 2025
12:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియాలో ఇటీవల ఓ భారతీయ విద్యార్థిపై దుండగులు దాడి చేసి,జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అలాంటిదే తాజాగా మరో జాత్యహంకార ఘటన మెల్‌బోర్న్ నగరంలోని బోరోనియా ప్రాంతంలో చోటుచేసుకుంది. అక్కడి ఓ హిందూ ఆలయాన్ని గుర్తుతెలియని వ్యక్తులు లక్ష్యంగా చేసుకుని విద్వేషపూరిత సందేశాలు గోడలపై రాశారు. ఈ నెల 21వ తేదీన స్వామి నారాయణ్ ఆలయం వద్ద ఈ ఘటన జరిగినట్టు సమాచారం. ఆలయ గోడపై హిట్లర్ చిత్రం అతికించి, దానిపై "గో హోమ్ బ్రౌన్..." అనే రాతను వ్రాసినట్లు తెలుస్తోంది. ఇదే ప్రాంతంలో ఆసియా దేశాలకు చెందిన ప్రజలు నడిపే కొన్ని రెస్టారెంట్లపై కూడా ఇలాంటి విద్వేష పూరిత వాక్యాలు వ్రాసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

వివరాలు 

ఘటనను ఖండించిన విక్టోరియా రాష్ట్ర ముఖ్యమంత్రి

ఈ ఘటనపై హిందూ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు మకరంద్ భగవత్ స్పందించారు. జరిగిన ఘటన తమను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు.ఇలాంటి చర్యలు దేవాలయాలను ప్రేమించే భక్తుల మనసులను బాధపెట్టే విధంగా ఉంటాయని చెప్పారు. దేవాలయాలు భక్తి, శాంతి, ఐక్యతకు చిహ్నాలని, అలాంటివి లక్ష్యంగా దాడులు జరగడం బాధాకరమన్నారు. విక్టోరియా రాష్ట్ర ముఖ్యమంత్రి జసింత్ అల్లన్ ఈ ఘటనను ఖండిస్తూ ఆలయ నిర్వాహకులకు లేఖ రాశారు. ఈ జాత్యహంకార చర్య తాను చూసిన విధ్వేషాత్మకమైన సంఘటనలలో ఒకటిగా భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇది కేవలం ఆస్తి ధ్వంసం మాత్రమే కాకుండా,స్పష్టమైన ద్వేషపూరిత చర్య అని ఆమె వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలకు విక్టోరియాలో చోటు లేదని పేర్కొంటూ,దానికి సంబంధించి పోలీసులకు దర్యాప్తు చేయాలని ఆదేశించారు.

వివరాలు 

భారత్‌కు చెందిన విద్యార్థి చరణ్‌ప్రీత్ సింగ్‌పై దుండగులు దాడి

బాధితుల మనోభావాలను గౌరవిస్తూ పోలీసులు కారకులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ ఘటనపై విచారణ మొదలుపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఇదిలాఉండగా.. ఈనెల 19న ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలో భారత్‌కు చెందిన విద్యార్థి చరణ్‌ప్రీత్ సింగ్‌పై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. పదునైన ఆయుధాలతో దాడి చేయడంతో పాటు, అతని పై జాత్యహంకార వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. గాయాలపాలైన అతడిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కారు పార్కింగ్‌ను కేంద్రంగా తీసుకొని ఈ వివాదం మొదలైందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో ఓ దుండగుడిని పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ, మిగిలిన వ్యక్తుల కోసం గాలింపు కొనసాగుతోంది.