Loading...
India-New Zealand FTA: భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య చారిత్రక ఒప్పందం అమల్లోకి.. భారత ఉత్పత్తులకు జీరో సుంకాలు!
భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య చారిత్రక ఒప్పందం అమల్లోకి.. భారత ఉత్పత్తులకు జీరో సుంకాలు!

India-New Zealand FTA: భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య చారిత్రక ఒప్పందం అమల్లోకి.. భారత ఉత్పత్తులకు జీరో సుంకాలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 20, 2026
03:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య కుదిరిన సమగ్ర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Free Trade Agreement - FTA) అక్టోబర్ 20 నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందంతో న్యూజిలాండ్‌ మార్కెట్లో భారతీయ ఎగుమతిదారులకు సరికొత్త వ్యాపార అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. భారతీయ ఉత్పత్తులకు న్యూజిలాండ్‌లో 100 శాతం ఉత్పత్తులపై సుంక రహిత ప్రవేశం (Zero-duty access) కల్పించడం ఈ ఒప్పందంలోని ప్రధాన అంశం. దేశీయ రైతుల ప్రయోజనాలను, సున్నితమైన రంగాలను పూర్తిస్థాయిలో పరిరక్షిస్తూనే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (MSME), మహిళా పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లకు విస్తృత మార్కెట్‌ అవకాశాలు కల్పించేలా ఈ చారిత్రక ఒప్పందాన్ని రూపొందించారు.

వివరాలు

భారత ఉత్పత్తులకు సున్నా సుంకాలు.. MSMEలకు భారీ ఊరట

ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు భారతీయ వ్యాపారాలకు అంతర్జాతీయ మార్కెట్లో అవకాశాలు పెంచడమే దీని ప్రధాన ఉద్దేశం.

FTA అమల్లోకి రావడంతో భారతీయ ఉత్పత్తులపై న్యూజిలాండ్‌ విధిస్తున్న గరిష్ఠంగా 10 శాతం వరకు ఉన్న సుంకాలు పూర్తిగా తొలగిపోయాయి.

దీంతో భారత ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను న్యూజిలాండ్‌ మార్కెట్లో మరింత పోటీతత్వంతో విక్రయించేందుకు అవకాశం ఏర్పడింది.

ముఖ్యంగా వస్త్రాలు, దుస్తులు, పాదరక్షలు, లెదర్ ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు, ఇంజినీరింగ్ పరికరాలు, ఔషధాలు, ఆటోమొబైల్స్‌ రంగాలకు ఈ ఒప్పందం గణనీయమైన ప్రయోజనం చేకూర్చనుంది.

వివరాలు

నూతన వినియోగదారులను చేరుకోవడానికి అవకాశం

భారతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి, కొత్త వినియోగదారులను చేరుకోవడానికి ఇది దోహదపడనుంది.

భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ వర్చువల్‌ విధానంలో భారత్‌ నుంచి న్యూజిలాండ్‌కు మొట్టమొదటి జేసీబీ (JCB) యంత్రం ఎగుమతిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో ఒప్పందం అమలును అధికారికంగా ప్రారంభించారు.

అంతేకాకుండా, రాబోయే సంవత్సరాల్లో న్యూజిలాండ్‌ నుంచి భారత్‌లోకి దాదాపు 20 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చేలా సులభతరం చేసేందుకు ఈ ఒప్పందం మార్గం సుగమం చేసింది.

భారత కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ.1.68 లక్షల కోట్లు. ఈ పెట్టుబడులు దేశంలో వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాల విస్తరణకు తోడ్పడే అవకాశం ఉంది.

ADVERTISEMENT

వివరాలు

రైతులకు రక్షణ.. వ్యవసాయ రంగంలో సాంకేతిక సహకారం

భారత్‌-న్యూజిలాండ్‌ వాణిజ్య ఒప్పందంలో దేశీయ వ్యవసాయ, పాడి పరిశ్రమల ప్రయోజనాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు.

స్థానిక రైతులపై ప్రతికూల ప్రభావం పడకుండా భారత్‌ పటిష్టమైన రక్షణ నిబంధనలను పొందుపరిచింది.

ఇందులో భాగంగా పాలు, వెన్న, చీజ్‌ వంటి పాడి ఉత్పత్తులతో పాటు చక్కెర, నూనెగింజలు వంటి సున్నితమైన ఉత్పత్తులను సుంకాల తగ్గింపు పరిధి నుంచి మినహాయించారు.

దీంతో ఈ రంగాల్లోని దేశీయ ఉత్పత్తిదారులకు రక్షణ కల్పించినట్లయింది.

మరోవైపు వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు న్యూజిలాండ్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్‌ వినియోగించుకోనుంది.

ADVERTISEMENT

వివరాలు

కివీ పండ్లు, తేనె దిగుబడులను పెంచేందుకు సహకారం

'అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ పార్ట్‌నర్‌షిప్‌' కింద ఆపిల్స్‌, కివీ పండ్లు, తేనె దిగుబడులను పెంచేందుకు సహకారం అందించనున్నారు.

ఇందుకోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటు చేయనున్నారు.

ఈ సహకారం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడం, దిగుబడులను పెంచడం, రైతులకు ఆధునిక సాగు పద్ధతులను అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

వివరాలు

ఐటీ, ప్రొఫెషనల్స్‌, సేవల రంగానికి కొత్త అవకాశాలు

ఈ ఒప్పందం వస్తువుల ఎగుమతులకే పరిమితం కాకుండా సేవల రంగానికీ విస్తృత అవకాశాలను కల్పించనుంది.

ఐటీ, నిర్మాణం, పర్యాటకం, వృత్తిపరమైన సేవలకు న్యూజిలాండ్‌లో మరింత మార్కెట్‌ అందుబాటులోకి రానుంది.

దీంతో భారతీయ సేవల సంస్థలు, నిపుణులు తమ కార్యకలాపాలను విస్తరించుకునే అవకాశం ఉంది.

భారతీయ ఔషధ కంపెనీలకు న్యూజిలాండ్‌లోని నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు పొందే ప్రక్రియ కూడా వేగవంతం కానుంది.

ఇది భారత ఫార్మాస్యూటికల్‌ రంగానికి ప్రయోజనం చేకూర్చనుంది.

భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రాబోయే కొద్ది సంవత్సరాల్లో రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఇరు దేశాలు ముందుకు సాగుతున్నాయని వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ అగర్వాల్‌ వెల్లడించారు.

ADVERTISEMENT