LOADING...
Historic Move in Canada: పర్యావరణ పరిరక్షణలో కొత్త అధ్యాయం.. చెట్లకు హక్కులు కల్పించిన కెనడా
పర్యావరణ పరిరక్షణలో కొత్త అధ్యాయం.. చెట్లకు హక్కులు కల్పించిన కెనడా

Historic Move in Canada: పర్యావరణ పరిరక్షణలో కొత్త అధ్యాయం.. చెట్లకు హక్కులు కల్పించిన కెనడా

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 22, 2026
12:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

పర్యావరణ పరిరక్షణకు కొత్త దిశానిర్దేశం చేస్తూ కెనడాలో ఓ అరుదైన నిర్ణయం వెలుగులోకి వచ్చింది. క్యూబెక్ ప్రావిన్స్‌లోని చిన్న పట్టణమైన టెరాస్-వౌడ్రూయిల్ చెట్లను అధికారికంగా ప్రాణమున్న జీవులుగా గుర్తిస్తూ చారిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించింది. జూన్ 9న పట్టణ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించిన ఈ తీర్మానం ద్వారా చెట్లకూ ప్రత్యేక హక్కులు ఉన్నాయని ప్రకటించింది. దీంతో చెట్ల హక్కులను అధికారికంగా గుర్తించిన కెనడాలోని తొలి మున్సిపాలిటీగా టెరాస్-వౌడ్రూయిల్ నిలిచింది.

వివరాలు 

అంతర్జాతీయ ఉద్యమానికి మద్దతు

మాంట్రియల్ ద్వీపానికి పశ్చిమాన ఉన్న ఈ పట్టణ జనాభా సుమారు 2 వేల మంది మాత్రమే. అయినప్పటికీ ప్రపంచ పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో కీలక సందేశాన్ని ఇచ్చింది. "యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ది ట్రీ" అనే అంతర్జాతీయ కార్యక్రమానికి మద్దతుగా ఈ తీర్మానాన్ని తీసుకొచ్చింది. తీర్మానంలో మూడు ప్రధాన అంశాలను స్పష్టంగా పేర్కొన్నారు. చెట్లు ప్రాణమున్న జీవులని, అవి మానవాళి ఉమ్మడి సంపదని మొదటి అంశంలో పేర్కొన్నారు. రెండో అంశంగా భూమిపై జీవం కొనసాగడంలో చెట్ల పాత్ర అత్యంత కీలకమని వివరించారు. మూడో అంశంగా మానవులు చెట్లతో సోదరభావం, సంఘీభావంతో వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు.

వివరాలు 

సినిమాతో మొదలైన చర్చ

ఈ నిర్ణయం వెనుక క్యూబెక్‌కు చెందిన ఫిల్మ్ మేకర్ ఆండ్రీ డెస్‍రోచర్స్ రూపొందించిన "డెస్ ఆర్బ్స్ ఎట్ డెస్ ఆర్ట్స్" అనే డాక్యుమెంటరీ ప్రధాన స్ఫూర్తిగా నిలిచింది. ఈ చిత్ర ప్రదర్శన అనంతరం చెట్లను కేవలం ప్రకృతి వనరులుగా కాకుండా జీవులుగా గుర్తించాలనే అంశంపై పట్టణంలో విస్తృత స్థాయిలో చర్చలు జరిగాయి. ఆ చర్చల ఫలితంగా టెరాస్-వౌడ్రూయిల్ పర్యావరణ కమిటీ మున్సిపల్ కౌన్సిల్‌కు అధికారిక విజ్ఞప్తి సమర్పించింది. దానిని పరిశీలించిన కౌన్సిల్ ఈ చారిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించింది. ప్రపంచవ్యాప్తంగా 87 వేల మందికి పైగా ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటించినట్లు టౌన్ కౌన్సిల్ వెల్లడించింది.

Advertisement

వివరాలు 

పచ్చదన పరిరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు

ఈ తీర్మానం ద్వారా సుస్థిర భవిష్యత్తు నిర్మాణంపై తమ నిబద్ధతను మరోసారి చాటుతున్నామని మేయర్ మిచెల్ బోర్డో తెలిపారు. చెట్ల హక్కులను గుర్తించిన నేపథ్యంలో పట్టణంలో పచ్చదనాన్ని మరింత విస్తరించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని చెప్పారు. కొత్త మొక్కల నాటకం, ఇప్పటికే ఉన్న చెట్ల సంరక్షణ, పర్యావరణ ప్రాధాన్యంపై ప్రజల్లో అవగాహన పెంపు వంటి కార్యక్రమాలను అమలు చేస్తామని వెల్లడించారు. స్థానిక సహజ వనరుల పరిరక్షణలో తమ పట్టణం నాయకత్వ పాత్ర పోషిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

వివరాలు 

మానవ కేంద్ర భావనకు సవాల్

సినిమా దర్శకుడు ఆండ్రీ డెస్‍రోచర్స్ మాట్లాడుతూ, ప్రపంచంలో మానవులే కేంద్రం అనే భావనను మార్చాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. ప్రకృతిలోని ఇతర జీవుల మాదిరిగానే మనుషులు కూడా జీవ ప్రపంచంలో ఒక భాగమని గుర్తించే దృక్పథాన్ని సమాజంలో పెంపొందించాలనుకున్నట్లు చెప్పారు. మానవ కేంద్ర దృక్పథం స్థానంలో పర్యావరణ కేంద్ర ఆలోచనను తీసుకురావడమే తన లక్ష్యమని ఆయన వివరించారు.

వివరాలు 

దేశానికి ఆదర్శంగా టెరాస్-వౌడ్రూయిల్

కెనడాకు చెందిన లాభాపేక్షలేని సంస్థ 'ఇంటర్నేషనల్ అబ్జర్వేటరీ ఆఫ్ నేచర్ రైట్స్' కూడా ఈ తీర్మానాన్ని స్వాగతించింది. చెట్ల హక్కుల ప్రకటనను అధికారికంగా ఆమోదించిన తొలి కెనడియన్ మున్సిపాలిటీ టెరాస్-వౌడ్రూయిల్ అని ధ్రువీకరించింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో స్థానిక సంస్థలు ఎంత ప్రభావవంతంగా పనిచేయగలవో ఈ నిర్ణయం నిరూపిస్తోందని పేర్కొంది. భవిష్యత్తులో మరిన్ని మున్సిపాలిటీలు ఇదే మార్గాన్ని అనుసరించే అవకాశముందని, ఈ విషయంలో టెరాస్-వౌడ్రూయిల్ ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

Advertisement