LOADING...
Bangladesh: కారుతో ఢీకొట్టి హత్య.. బంగ్లాదేశ్‌లో మరో హిందువుపై దాడి
కారుతో ఢీకొట్టి హత్య.. బంగ్లాదేశ్‌లో మరో హిందువుపై దాడి

Bangladesh: కారుతో ఢీకొట్టి హత్య.. బంగ్లాదేశ్‌లో మరో హిందువుపై దాడి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 17, 2026
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌లో మైనారిటీలను లక్ష్యంగా చేసుకున్న దాడులు ఆగడం లేదు. తాజాగా మరో హిందువు హత్యకు గురయ్యాడు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, శుక్రవారం ఒక వ్యక్తి కారుతో ఢీకొట్టడంతో హిందూ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రాజ్‌బరి జిల్లాలోని కరీం ఫిల్లింగ్‌ స్టేషన్‌లో రిపోన్‌ సాహా (30) పనిచేస్తున్నాడు. శుక్రవారం బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్‌పీ) రాజ్‌బరి జిల్లా యూనిట్‌ మాజీ కోశాధికారి అబుల్‌ హషేమ్‌ తన కారుతో పెట్రోల్‌ బంక్‌కు వచ్చాడు. ఇంధనం కొట్టించుకున్న అనంతరం డబ్బు చెల్లించకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో రిపోన్‌ అతడిని ఆపి, పెట్రోల్‌కు సంబంధించిన డబ్బు ఇవ్వాలని కోరాడు. ఈ విషయంపై ఆగ్రహానికి గురైన అబుల్‌ హషేమ్‌ తన కారును రిపోన్‌పైకి దూసుకెళ్లాడు.

Details

ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు

కారు అతడి మీదుగా వెళ్లడంతో రిపోన్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటన స్థలంలోనే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, సంబంధిత వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అబుల్‌ హషేమ్‌తో పాటు అతడి కారు డ్రైవర్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా, కేవలం మూడు వారాల వ్యవధిలోనే దాదాపు పది మంది హిందువులు హత్యకు గురవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వరుస ఘటనలతో బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల భద్రతపై సందేహాలు, భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement