Loading...
Nepal: బతికే ఉన్నారేమోనని ఆశ.. నేపాల్‌లో ఆత్మీయుల కోసం వెతుకులాట
బతికే ఉన్నారేమోనని ఆశ.. నేపాల్‌లో ఆత్మీయుల కోసం వెతుకులాట

Nepal: బతికే ఉన్నారేమోనని ఆశ.. నేపాల్‌లో ఆత్మీయుల కోసం వెతుకులాట

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 30, 2026
09:58 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆసుపత్రుల వద్ద తమవారి కోసం పడిగాపులు కాస్తున్న జనం.. గోడలకు అంటించిన పోస్టర్లలో ఆత్మీయుల కోసం వెతుకులాట.. కుప్పకూలిన భవనాల వద్ద దీనంగా ఎదురుచూస్తున్న కుటుంబాలు.. బురద, మట్టిలో తమ వస్తువుల కోసం అన్వేషణ.. శిథిలాల మధ్య మృతి చెందిన జంతువులు.. గల్లంతైన తమవారు తిరిగి రావాలని ప్రార్థనలు.. ప్రస్తుతం నేపాల్‌లో ఎక్కడ చూసినా ఇలాంటి విషాదకర పరిస్థితులే కనిపిస్తున్నాయి. బుధవారం వరదలు ముంచెత్తినప్పటి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ గల్లంతైనవారి ఆచూకీ పూర్తిగా లభించడం లేదు. మృతులతో పాటు ఆచూకీ తెలియని వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటివరకు దాదాపు 2,400 మంది ఎక్కడ ఉన్నారో, ఏమయ్యారో తెలియడం లేదు.

వివరాలు

హెలికాప్టర్ల ద్వారానే సురక్షిత ప్రాంతాలకు

వీరిలో 320 మంది విదేశీయులు కాగా.. 287 మంది భారతీయులు ఉన్నారు. విపత్తు సంభవించి నాలుగు రోజులు కావడంతో గల్లంతైనవారి కుటుంబాల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి.

వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన దాదాపు 4,400 మందిని సహాయక బృందాలు ఇప్పటివరకు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.

వీరిలో 167 మంది భారతీయులు ఉన్నారు. మిగిలినవారిలో చైనా, ఉక్రెయిన్, జర్మనీ, మాల్టా, అమెరికా, తుర్కియే, పోర్చుగల్, రష్యా, స్పెయిన్, స్విట్జర్లాండ్, ఇటలీ, ఒమన్, బెల్జియం, బల్గేరియా దేశాలకు చెందినవారు ఉన్నారు.

వరదల కారణంగా రహదారులు తీవ్రంగా దెబ్బతినడంతో బాధితులను చాలా ప్రాంతాల నుంచి హెలికాప్టర్ల ద్వారానే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు టిబెట్‌లో 550 మంది ఆచూకీ ఇంకా తెలియడం లేదు.

వివరాలు

వెతుకులాటలో వేల మంది

నేపాల్‌లో మృతుల సంఖ్య 675కు చేరగా.. టిబెట్‌లో ఏడు మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో ఈ విపత్తులో మొత్తం మృతుల సంఖ్య 682కు చేరుకుంది.

ఇదిలా ఉండగా వరద ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని నేపాల్ వాతావరణశాఖ శనివారం హెచ్చరించింది.

నేపాల్‌లో కొనసాగుతున్న సహాయక చర్యల్లో 11,000 మంది భద్రతా సిబ్బందితో పాటు 5,000 మంది నేపాల్ సైనికులు పాల్గొంటున్నారు.

భారత్ నుంచి 11 మంది వైద్య సిబ్బంది, టన్నెల్ నిపుణులు కూడా సహాయక చర్యల్లో భాగస్వాములయ్యారు.

వారు శనివారం త్రిశూలి వద్ద ఉన్న జల విద్యుత్తు ప్రాజెక్టు టన్నెల్‌లో సహాయక చర్యలు చేపట్టారు. త్రిశూలి, రసువా ప్రాంతాల్లోని టన్నెళ్ల నుంచి ఇప్పటివరకు 191 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

ADVERTISEMENT

వివరాలు

1,706 మందికి వైద్య సాయం

మరోవైపు 1,706 మందికి వైద్య సాయం అందిస్తున్నారు.

విపత్తు సమయంలో భారత్ అందిస్తున్న సహాయాన్ని నేపాల్ ప్రశంసించింది. ప్రధాని మోదీ ఎంతో ఉదారంగా వ్యవహరిస్తున్నారని కొనియాడింది.

రసువా జల విద్యుత్తు ప్రాజెక్టు నుంచి నలుగురు భారతీయులను కూడా శనివారం సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

ADVERTISEMENT

వివరాలు

మరో మార్గం ద్వారా భారతీయుల తరలింపు

టిబెట్‌లో చిక్కుకున్న 120 మంది భారతీయులను మరో మార్గం ద్వారా శనివారం నేపాల్‌కు తరలించారు.

మానసరోవర్ యాత్రికులకు గైరాంగ్-నేపాల్ సరిహద్దు ప్రధాన మార్గంగా ఉండేది.

అయితే వరదల కారణంగా ఆ మార్గం ధ్వంసం కావడంతో ప్రస్తుతం జాంగ్ము మార్గం ద్వారా భారతీయులను తరలించారు.

డీఆర్‌డీవో మాజీ ఛైర్మన్ సతీశ్‌రెడ్డి కూడా శనివారం జాంగ్ము మార్గం ద్వారానే నేపాల్ చేరుకున్నారు. జాంగ్ము వద్ద వందలాది బస్సులు, ఇతర వాహనాలు ఉన్నాయని ఆయన తెలిపారు.

ఆగస్టు 23న ఆయన 31 మందితో కలిసి టిబెట్‌కు వెళ్లారు. చైనా అధికార మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. గైరాంగ్ నుంచి 1,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారిలో 555 మంది పర్యాటకులు ఉన్నారు.

వివరాలు

వరద సహాయక చర్యలకు భారీగా విరాళాలు

నేపాల్‌లో వరద సహాయక చర్యల కోసం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలతో పాటు వ్యక్తుల నుంచి కూడా భారీగా విరాళాలు అందుతున్నాయి.

87 ఏళ్ల రాజీ రాణా అనే దాత 10.98 మిలియన్ నేపాలీ రూపాయలను విరాళంగా అందించారు.

ఒక ప్రైవేటు సంస్థ 150 మిలియన్ నేపాలీ రూపాయలు, మరో సంస్థ 50 మిలియన్ నేపాలీ రూపాయలను సహాయంగా అందించింది.

ఇప్పటివరకు ప్రధాని సహాయ నిధికి 2.295 బిలియన్ నేపాలీ రూపాయలు విరాళాలుగా వచ్చినట్లు అధికారులు తెలిపారు.

వివరాలు

97 ఏళ్ల బామ్మ సురక్షితం

నేపాల్ వరదల్లో కేర్ సెంటర్‌లో చిక్కుకున్న 97 ఏళ్ల గుణ మాయ బొహరాను సహాయక సిబ్బంది నాలుగు గంటలు శ్రమించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. కేర్ సెంటర్‌లో భారీగా పేరుకుపోయిన బురద నుంచి ఆమెను బయటకు తీసుకొచ్చిన అనంతరం ఎక్స్‌కావేటర్ టబ్‌లో తరలించారు.

ఈ సమయంలో ఆమె ఒంటినిండా బురదతో ఉన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

తన బామ్మ యోధురాలిలా విపత్తు నుంచి బయటకు వచ్చారని ఆమె మనవడు దీపక్ బొహరా తెలిపారు.

ఆమెను రక్షించేందుకు కాఠ్‌మాండూ నుంచి ఘటనా స్థలానికి వెళ్లినట్లు చెప్పారు. అయితే కేర్ సెంటర్‌లో మిగిలిన వారు మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని దీపక్ పేర్కొన్నారు.

ADVERTISEMENT