Loading...
Iran: హర్మూజ్‌ మాదే.. యుద్ధ నౌకలతోనైనా ఆక్రమించలేరు: ట్రంప్‌కు ఇరాన్‌ వార్నింగ్
హర్మూజ్‌ మాదే.. యుద్ధ నౌకలతోనైనా ఆక్రమించలేరు: ట్రంప్‌కు ఇరాన్‌ వార్నింగ్

Iran: హర్మూజ్‌ మాదే.. యుద్ధ నౌకలతోనైనా ఆక్రమించలేరు: ట్రంప్‌కు ఇరాన్‌ వార్నింగ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 15, 2026
02:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

హర్మూజ్‌ జలసంధిపై పూర్తి నియంత్రణ అమెరికాదేనంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను ఇరాన్‌ తీవ్రంగా ఖండించింది. హర్మూజ్‌ ఎప్పటికీ తమ నియంత్రణలోనే ఉంటుందని, దానిని ఎవరూ ఆక్రమించుకోలేరని స్పష్టం చేసింది. జలసంధిని మూసి ఉంచాలా? తెరిచి ఉంచాలా? అనేది తమ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని ఇరాన్‌ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్‌ ఘరీబాబాదీ తెలిపారు. యుద్ధ నౌకలను మోహరించడం ద్వారా హర్మూజ్‌ను స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాదని ఆయన ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. అమెరికా తన భ్రమలను వీడి ఓటమిని అంగీకరించే వరకు హర్మూజ్‌పై ఇరాన్‌ దిగ్బంధనాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. అమెరికా బెదిరింపులకు తాము భయపడమని, సైనిక బల ప్రదర్శనలకు లొంగబోమని తేల్చిచెప్పారు.

వివరాలు

'అమెరికా చెబుతున్నది నిజం కాదు'

హర్మూజ్‌ జలసంధి ద్వారా నౌకలు స్వేచ్ఛగా ప్రయాణిస్తున్నాయని అమెరికా చేస్తున్న ప్రకటనల్లో వాస్తవం లేదని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ అన్నారు.

గతంలో మాదిరిగానే ప్రస్తుతం కూడా జలసంధి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందని తెలిపారు.

ఇరాన్‌ సాయుధ దళాల అనుమతి లేకుండా ఏ వాణిజ్య నౌక కూడా హర్మూజ్‌ మార్గంలో ప్రయాణించబోదని అరాగ్చీ స్పష్టం చేశారు.

హర్మూజ్‌ విషయంలో అమెరికా తప్పుడు అంచనాలు వేస్తోందని ఆయన విమర్శించారు.

వివరాలు

ట్రంప్‌ ఏమన్నారు?

ఇరాన్‌పై యుద్ధంలో అమెరికా విజయం సాధిస్తుందని ట్రంప్‌ శనివారం జరిగిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

ఇరాన్‌ ఓటమిని అంగీకరించిన అనంతరం వ్యూహాత్మకంగా కీలకమైన హర్మూజ్‌ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.

ఇరాన్‌ వద్ద అణ్వాయుధ సామర్థ్యం ఉండటం భవిష్యత్తులోనూ ప్రమాదకరమేనని ట్రంప్‌ అన్నారు.

ఆ సామర్థ్యాన్ని ధ్వంసం చేయాలనే లక్ష్యంతోనే అమెరికా ఇరాన్‌పై యుద్ధానికి దిగిందని ఆయన వెల్లడించారు.

ADVERTISEMENT