LOADING...
Plane crash: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. 11 మంది స్కైడైవర్లు సహా 12 మంది మృతి
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. 11 మంది స్కైడైవర్లు సహా 12 మంది మృతి

Plane crash: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. 11 మంది స్కైడైవర్లు సహా 12 మంది మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 15, 2026
11:29 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో ఘోర విషాదకర ఘటన చోటుచేసుకుంది. బట్లర్ మెమోరియల్ ఎయిర్‌పోర్టు సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో 11 మంది స్కైడైవర్లు, ఒక పైలట్ సహా మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, స్కైడైవింగ్ కోసం ప్రయాణికులను తీసుకెళ్తున్న పసిఫిక్ ఏరోస్పేస్ P750XL సింగిల్-ఇంజిన్ టర్బోప్రాప్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్యలను ఎదుర్కొంది. విమానం అవసరమైన ఎత్తుకు చేరుకునేలోపే అకస్మాత్తుగా ఎడమవైపు తిరిగినట్లు సమాచారం. అనంతరం రన్‌వే నుంచి సుమారు 300 గజాల దూరంలో నేలపై కుప్పకూలి మంటల్లో చిక్కుకుంది.

వివరాలు

మొత్తం 12 మంది మృతి

విమానాన్ని నిర్వహిస్తున్న స్కైడైవ్ కాన్సాస్ సిటీ సంస్థ విడుదల చేసిన ప్రకటనలో ప్రమాదంలో ఉన్న మొత్తం 12 మంది మరణించినట్లు ధృవీకరించింది. మృతుల్లో 11 మంది స్కైడైవర్లు కాగా, మరో వ్యక్తి పైలట్ అని వెల్లడించింది. కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన అనంతరం మాత్రమే మృతుల వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. బేట్స్ కౌంటీ షెరీఫ్ చాడ్ ఆండర్సన్ తెలిపిన ప్రకారం, ఈ ప్రమాదాన్ని పలువురు కుటుంబ సభ్యులు తమ కళ్లముందే చూసారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సేవల బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే విమానం పూర్తిగా మంటల్లో చిక్కుకోవడంతో అందులోని ఎవరూ ప్రాణాలతో బయటపడలేకపోయారు.

వివరాలు

అసలు కారణం ఇంకా తెలియరాలేదు

బేట్స్ కౌంటీ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ డెన్నిస్ జాకబ్స్ ప్రాథమిక అంచనా ప్రకారం, పైలట్ సమీపంలోని రహదారిపై అత్యవసర ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే ఇది కేవలం ప్రాథమిక అంచనా మాత్రమేనని, ప్రమాదానికి అసలు కారణం ఇంకా నిర్ధారణ కాలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానం ఇంకా తక్కువ ఎత్తులోనే ఉండటంతో స్కైడైవర్లలో ఎవరూ దూకే అవకాశం పొందలేదని అధికారులు వెల్లడించారు. డ్రోన్లు, ప్రత్యేక బృందాలతో సంఘటనా స్థలాన్ని పూర్తిగా పరిశీలించినప్పటికీ ప్రాణాలతో బయటపడిన వ్యక్తులు ఎవరూ కనిపించలేదని తెలిపారు.

Advertisement

వివరాలు

దర్యాప్తు ప్రారంభించిన ఏవియేషన్ సంస్థలు

ఈ ఘటనపై సంబంధిత ఏవియేషన్ సంస్థలు దర్యాప్తు ప్రారంభించాయి. విమానం నిర్వహణ చరిత్ర, సాంకేతిక పరిస్థితి, పైలట్‌కు సంబంధించిన వివరాలు, ప్రమాద సమయంలో ఉన్న వాతావరణ పరిస్థితులు తదితర అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను నిర్ధారించే తుది నివేదిక వెలువడేందుకు 12 నుంచి 24 నెలల సమయం పట్టే అవకాశం ఉందని ఎన్‌టీఎస్‌బీ పేర్కొంది. ఈ దుర్ఘటనతో మిస్సోరీ రాష్ట్రం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. స్కైడైవింగ్ అనుభవం కోసం ఉత్సాహంగా బయలుదేరిన 12 మంది జీవితాలు క్షణాల్లో ముగియడంతో స్థానిక సమాజం శోకసంద్రంలో మునిగిపోయింది.

Advertisement