Nepal: నేపాల్‌లో ఘోర విషాదం.. సొరంగాల్లో 570 మందికి పైగా కార్మికులు
ఈ వార్తాకథనం ఏంటి
నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. రసువా, నువాకోట్ జిల్లాల్లోని 11 జలవిద్యుత్ ప్రాజెక్టుల వద్ద 573 మందికిపైగా కార్మికులు సొరంగాల్లో చిక్కుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు. మంచు, రాళ్లు, వరద నీరు కలిసి ల్హెండే-భోటే కోశి-త్రిశూలి నదీ వ్యవస్థను ముంచెత్తడంతో భారీ విపత్తు సంభవించింది. 11 ప్రాజెక్టు ప్రాంతాల పరిధిలో తొలుత 934 మంది కార్మికులు గల్లంతైనట్లు నేపాల్ ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. వీరిలో 361 మందిని ఇప్పటివరకు సురక్షితంగా రక్షించారు. అయితే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో నమోదుకాని కార్మికులు కూడా పనిచేస్తుండటంతో గల్లంతైన వారి సంఖ్య అధికారిక లెక్కల కంటే మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సమాచారం.
వివరాలు
సొరంగాల్లో 10 నుంచి 12 అడుగుల మేర బురద
సొరంగాల్లో చిక్కుకున్న వారిలో భారతీయులతో పాటు నేపాల్, దక్షిణ కొరియా, చైనా, జర్మనీ దేశాలకు చెందిన పౌరులు ఉన్నారు.
వీరిలో అత్యధిక మంది నాలుగు జలవిద్యుత్ ప్రాజెక్టుల్లోనే చిక్కుకున్నారు. అప్పర్ త్రిశూలి-1 ప్రాజెక్టు వద్ద 322 మంది, అప్పర్ త్రిశూలి-3బి వద్ద 122 మంది, అప్పర్ త్రిశూలి-3ఎ వద్ద 43 మంది, రసువాగఢి జలవిద్యుత్ ప్రాజెక్టు వద్ద 44 మంది కార్మికులు చిక్కుకుపోయారు.
భారీగా వచ్చిన వరద నీటితో పాటు బురద, శిథిలాలు సొరంగాల్లో 10 నుంచి 12 అడుగుల మేర పేరుకుపోయాయి.
దీంతో సొరంగాల్లోకి వెళ్లే మార్గాలు పూర్తిగా మూసుకుపోయాయి. చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
వివరాలు
రెస్క్యూ చర్యల్లో నేపాల్ ఆర్మీ
సహాయక చర్యలను ముమ్మరం చేసిన నేపాల్ ఆర్మీ 15 హెలికాప్టర్లతో పాటు వందలాది మంది రెస్క్యూ సిబ్బందిని రంగంలోకి దించింది.
సొరంగాల్లో చిక్కుకున్న వారిని గుర్తించి సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
మరోవైపు భారత్ కూడా నేపాల్‌కు సహాయక బృందాలను పంపించింది. సాంకేతిక, వైద్య, టన్నెల్ నిపుణులతో కూడిన బృందాలు అక్కడ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
సీ-130జే హెర్క్యులస్ విమానం ద్వారా సైనిక టన్నెల్ రెస్క్యూ నిపుణులతో పాటు ఫోరెన్సిక్ విభాగాల సిబ్బందిని తరలిస్తోంది.
ఈ వరద విపత్తులో ఇప్పటివరకు నేపాల్‌లో 675 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. నేపాల్, టిబెట్ ప్రాంతాల్లో కలిపి దాదాపు 3,000 మంది ఆచూకీ గల్లంతైనట్లు సమాచారం.