Biden: బందీల విడుదలకు త్వరలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పందం: బైడెన్
హమాస్ చేతిలో బందీలుగా ఉన్న వారిని విడిపించడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేశారు. గాజాలో హమాస్ చేతిలో బందీలుగా ఉన్న వారిని విడుదల చేసేలా ఒప్పందం కుదుర్చుకోబోతున్నట్లు బైడెన్ చెప్పారు. దీనికి సంబంధించిన ఒప్పందం త్వరలో కుదుర్చుకోనున్నట్లు బైడెన్ పేర్కొన్నారు. హమాస్ ఉగ్రవాదులు లక్ష్యంగా గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ దళాల సైనిక చర్య కొనసాగుతోంది. ఇరువర్గాల మధ్య యుద్ధం వల్ల అమాయక ప్రజలు చనిపోతున్న నేపథ్యంలో కాల్పుల విరమణ చేయాలని ఇజ్రాయెల్‌పై ఐక్యరాజ్యసమితితో పాటు పలు ప్రపంచ దేశాలు ఒత్తిడి తెస్తున్నాయి. హమాస్ ఉగ్రవాదులు బందీలందరినీ విడుదల చేసే వరకు యుద్ధం కొనసాగుతుందని ఇజ్రాయెల్ చెబుతోంది. ఈ క్రమంలో బందీల విడుదల కోసం అమెరికా రంగంలోకి దిగింది.
240 మంది బందీలు విడుదలయ్యే అవకాశం
గాజాలో శాంతిని నెలకోల్పేందుకు బందీలను విడుదల చేయడానికి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ఒప్పందాన్ని కుదుర్చేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఇందులో ఖతార్ ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. అయితే ఇజ్రాయెల్, హమాస్‌లను ఒప్పందానికి ఒప్పించడం అమెరికాకు అంత సులభం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఒప్పందం తర్వాత దాదాపు 240 మంది బందీలను హమాస్ విడుదల చేయొచ్చని ఖతార్ విశ్వసిస్తోంది. ఇదిలా ఉంటే, ఇప్పటికే గాజాలో హమాస్ కీలక స్థావరంగా భావిస్తున్న 'అల్-షిఫా' ఆస్పత్రిని స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ సైన్యం.. తాజాగా గాజా జబాలియా సమీపంలోని అతిపెద్ద శరణార్థి శిబిరం చుట్టుముడుతోంది. శిబిరంలోని నివాసితులను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది.